హైదరాబాద్ ఐటీ కారిడార్​లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్​ వాటర్

హైదరాబాద్ ఐటీ కారిడార్​లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్​ వాటర్
  • పెద్ద ఎత్తున గేటెడ్​కమ్యూనిటీలు, ఇల్లీగల్​నిర్మాణాలు
  •  ఇంటికో బోరుతో ఎండాకాలంలో పడిపోతున్న గ్రౌండ్​వాటర్
  • విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నా.. అడ్డుకోని అధికారులు
  • వాటర్​బోర్డు ట్యాంకర్లు లేట్​అవుతుండడంతో ప్రైవేటును ఆశ్రయిస్తున్న జనం  

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​ను నీటి ఇబ్బందులు చుట్టుముట్టాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఇండ్లు, ఇంటికో బోరు ఉండడంతో ఎండలు పెరగగానే గ్రౌండ్​వాటర్​పడిపోతుంది. ఫలితంగా బోర్లు ఎండిపోతున్నాయి. ఏటా ఎండా కాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోంది. విచ్చలవిడిగా ఇండ్ల నిర్మాణానికి అనుమతులివ్వడం, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం వాటర్​షార్టేజ్​కు కారణంగా తెలుస్తోంది. వేల లోతుకు బోర్లు వేస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి నిఘా పెట్టడం లేదు. ప్రస్తుతం వాటర్​బోర్డు సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతోపాటు బోర్లు మొరాయిస్తుండడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్​బోర్డు ట్యాంకర్లు లేటుగా వస్తుండడంతో ప్రైవేట్​ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. బుక్​చేసిన వారం రోజులకు వాటర్​బోర్డు ట్యాంకర్​వస్తుందని జనం వాపోతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్​ట్యాంకర్ల నిర్వాహకులు రేట్లు పెంచేస్తున్నారు. 

విస్తీర్ణం తక్కువ.. జనాభా ఎక్కువ

ఐటీ కారిడార్​పరిధిలోని కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు జీహెచ్ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, హైరైజ్ బిల్డింగులు, ఇండిపెండెంట్ ఇండ్లు, హాస్టళ్లు కలిపి మొత్తం1,40,500 ఇండ్లు ఉన్నాయి. అధికారులు పెద్ద ఎత్తున గేటెడ్​కమ్యూనిటీలు, హైరైజ్​అపార్ట్​మెంట్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. కాలనీల్లో చాలా మంది ఒకటి, రెండు ఫోర్లకు పర్మిషన్లు తీసుకొని ఐదు, ఆరు ఫ్లోర్లు నిర్మిస్తున్నారు. దీంతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. డిమాండ్​ఎక్కువగా ఉండడంతో చాలా మంది హాస్టళ్ల ఏర్పాటుకు బిల్డింగులు నిర్మిస్తున్నారు. ఇలా తక్కువ ప్రదేశంలో ఎక్కువ మంది జనాభా నివసిస్తున్నారు. బోర్లతోపాటు వాటర్​బోర్డు సరఫరా చేస్తున్న నీళ్లు చాలట్లేదు. ఎండా కాలంలో నీటి వినియోగం భారీగా పెరగడంతో నీటి కొరత తీవ్రమైంది.

వాల్టా చట్టానికి తూట్లు

కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ఏరియాల్లో ఇంటికో బోరు ఉంది. రెవెన్యూ అధికారులు వాల్టా చట్టం ప్రకారం 300 నుంచి 400 మీటర్ల లోతు వరకు బోరు తవ్వుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. బోర్లతోపాటు ఇంటింటికి వాటర్​బోర్డు అధికారులు నల్లా కనెక్షన్​ఇస్తున్నారు. అయితే బోరు వేసే సమయంలో ఇంటి నిర్మాణదారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. నీళ్లు పడడం లేదని 1000 నుంచి 1500 మీటర్ల వరకు బోర్లు వేస్తున్నారు. ఒకరిని చూసి ఇంకొకరు బోర్ల లోతు పెంచుకుంటూపోతున్నారు. ఏడాదంతా విచ్చలవిడిగా నీళ్లు తోడేస్తుండడంతో ఎండకాలం నాటికి స్థానికంగా బోర్లు ఎండిపోతున్నాయి. ఐటీ కారిడార్​వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, హైరైస్​బిల్డింగుల నిర్వాహకులు అక్కడి జనం అవసరాలు తీర్చేందుకు నాలుగు, ఐదు బోర్లు వేస్తున్నారు.

వాటర్​బోర్డు నీళ్ల చాలట్లే

వాటర్​బోర్డు అధికారులు రోజు విడిచి రోజు ఐటీ కారిడార్ లో 9 ఎంజీడీలు నీటిని సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. బస్తీల్లో గంట, కాలనీల్లో గంటన్నర  నుంచి 2 గంటల పాటు సరఫరా జరుగుతోంది. ఒక్కో బిల్డింగ్ లో 5 నుండి 6 కుటుంబాలు ఉండటం, గేటెడ్ కమ్యూనిటీలు, హైరైస్ బిల్డింగ్​లో వందల కుటుంబాలు నివసిస్తుండడంతో వాటర్​బోర్డు నీళ్లు చాలట్లేదు. ప్రైవేట్​ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్​లో 5 వేల లీటర్ల కెపాసిటీ ట్యాంకర్లు 160; 10 వేల లీటర్ల కెపాసిటీ ట్యాంకర్లు  44; 20 వేలు, 25వేల లీటర్ల ట్యాంకర్లు ఒక్కొకటి ఉన్నాయి. డెయిలీ 1500 బుక్సింగ్ వస్తున్నాయని, 2100 ట్యాంకర్లు డెలివరీ చేస్తున్నట్లు వాటర్​బోర్డు అధికారులు చెబుతున్నారు. కానీ డిమాండుకు తగ్గ సరఫరా జరగడం లేదని జనం అంటున్నారు. ప్రైవేట్​ట్యాంకర్ల ఆపరేటర్లు ఫిబ్రవరి వరకు 5 వేల లీటర్ల ట్యాంకర్ ను రూ.800కు సరఫరా చేయగా, ప్రస్తుతం రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. 

రోజూ 4 ట్యాంకర్లు తెప్పిస్తున్నాం


మా అపార్ట్ మెంట్ లో మొత్తం 39 ప్లాట్లు ఉన్నాయి. ఫిబ్రవరి మొదట్లోనే ఉన్న బోరు ఎండిపోయింది. వాటర్​బోర్డు సరఫరా చేస్తున్న నీళ్లు చాలట్లేదు. వాటర్​బోర్డు ట్యాంకర్లు బుక్​చేస్తే లేటుగా వస్తున్నాయి. చేసేదేమీ లేక ప్రైవేట్​ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాం. డెయిలీ 5 వేల లీటర్ల కెపాసిటీ ట్యాంకర్లు 4 ట్యాంకర్లు కొంటున్నాం.
– సత్యనారాయణ, శ్రీసాయి కేశవ అపార్ట్​మెంట్, కొండాపూర్

2100 ట్రిప్పులు సరఫరా చేస్తున్నాం


శేరిలింగంపల్లి పరిధిలో 204 ట్యాంకర్ల ద్వారా డెయిలీ 2,100 ట్రిప్పులు సరఫరా చేస్తున్నాం. రోజుకు 1500 ట్యాంకర్ల బుకింగ్స్ వస్తున్నాయి. గతంలో డిమాండ్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం బుకింగ్ చేసిన 24 గంటల్లో ట్యాంకర్​పంపిస్తున్నాం. నల్లాల ద్వారా కాలనీల్లో గంటన్నర నుండి 2 గంటల పాటు, బస్తీలో గంట సేపు నీటిని సరఫరా చేస్తున్నాం.
– రాజశేఖర్, వాటర్​బోర్డు జీఎం, శేరిలింగంపల్లి