- సీఎన్జీ సెగ.. డ్రైవర్ల గోస ఇంధన కొరతతో ఉపాధిపై దెబ్బ
- రోజంతా బంకుల వద్దే బారులు.. పైగా అదనపు వసూళ్లు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు.. ఆందోళనకు పిలుపు
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్లో ఎల్పీజీ, సీఎన్జీ కొరత తీవ్రమవ్వడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. నగరంలో అత్యధిక శాతం క్యాబ్‌లు ఈ ఇంధనంపైనే నడుస్తుండటంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక డ్రైవర్లు గంటల తరబడి బంకుల వద్దే గడపాల్సి వస్తున్నది. ఒకవైపు ఆటో ఎల్పీజీ బంకులు ఇప్పటికే మూతపడగా, తాజాగా సీఎన్జీ సరఫరా లేక బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. పర్యావరణ హితం, అధిక మైలేజీ ఇస్తుండటంతో నగరంలో ప్రస్తుతం 55 వేల ఆటోలు, 135 బస్సులు, 2,200 కార్లు సీఎన్జీతోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలో రోజుకు 10 టన్నుల సీఎన్జీ డిమాండ్ఉండగా, ప్రస్తుతం కేవలం 3,500 కేజీలు మాత్రమే సరఫరా అవుతున్నదని డీలర్లు, బంకుల నిర్వాహకులు చెబుతున్నారు.
సరఫరా వ్యవస్థలోనే జాప్యం
ప్రధానంగా శామీర్‌పేటలోని మదర్ స్టేషన్ నుంచి సరఫరా అయ్యే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. అక్కడ ఒక ట్యాంకర్ నింపడానికి 45 నిమిషాలు, అది నగరానికి చేరేందుకు 2 గంటలు, తిరిగి బంకులో అన్‌లోడ్ చేసేందుకు మరో గంటన్నర.. ఇలా ఒక్కో ట్రిప్పుకు దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతున్నది. పైగా ఒక్కో ట్యాంకర్ కేవలం 350 నుంచి 400 కేజీల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండటం ఈ సమస్యను మరింత క్లిష్టంగా మార్చుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా కేవలం 50 బంకులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇంధనం కోసం రోజంతా లైన్లలోనే గడపాల్సి రావడంతో తమ ఉపాధి దెబ్బతింటుందని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
16న ఆటో డ్రైవర్ల ఆందోళన
ఎల్పీజీ, సీఎన్జీ కొరతపై రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులు శనివారం ఏఐటీయూసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇంధన కొరతను నిరసిస్తూ, పెరిగిన ధరలను తగ్గించాలని సోమవారం నారాయణగూడ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు నాయకులు బి.వెంకటేశం, ఎ. సత్తిరెడ్డి, సలీం, మారయ్య, జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోసం మరింత ఉధృతంగా నిరసనలు తెలుపుతామని వారు స్పష్టం చేశారు.
ఇదే అదునుగా అక్రమ దందా!
సీఎన్జీ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు బంకుల నిర్వాహకులు కేజీ ధర రూ.96 ఉండగా, మరో రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారని మహ్మద్ సుభానీ అనే ఆటో డ్రైవర్ ఆరోపించారు. ఓలా, ఉబెర్, రాపిడో వంటి సంస్థల్లో పనిచేసే వేలాది మంది గిగ్ కార్మికులు తమ ఉపాధి కోసం వీటిపైనే ఆధారపడి ఉన్నారని, ఇంధన కొరత వారి పరిస్థితిని దయానీయంగా మార్చిందని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, ముఖ్యంగా డ్రైవర్లు, డెలివరీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు 2,000 రూపాయల వరకు సంపాదించే తనకు, ఇప్పుడు క్యూలో నిల్చోవడానికే సమయం సరిపోతోందని, కనీసం రూ.వెయ్యి కూడా రావడం లేదని మరో క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ వాపోయారు. మరో ఆటో డ్రైవర్ బాలరాజు మాట్లాడుతూ.. కొన్ని బంకుల్లో ఫుల్ ట్యాంక్ కొట్టకుండా, అదనపు ధరలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
