36 మంది ప్రొఫెసర్లపై వేటు.

36 మంది ప్రొఫెసర్లపై వేటు.

హైదరాబాద్‌‌, వెలుగుకాకతీయ విశ్వవిద్యాలయంలో 2009, 2012లో జారీ చేసిన నోటికేషన్ల ద్వారా రిక్రూట్‌‌ అయిన 39 మంది అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్లు, ఒక ప్రొఫెసర్‌‌పై వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌‌ కౌన్సిల్(ఈసీ) వేటు వేసింది. ఈ నియామకాలు అక్రమమని తేలడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌‌లో జరిగింది. సమావేశానికి ఇన్‌‌చార్జి వీసీ, విద్యాశాఖ కార్యదర్శి  జనార్దన్‌‌ రెడ్డి, ఈసీ మెంబర్‌‌ కళాశాల విద్యా కమిషనర్‌‌ నవీన్‌‌ మిట్టల్‌‌, ఇతర సభ్యులు హాజరయ్యారు. గతంలో జరిగిన అక్రమ నియామకాలపై ఈ సమావేశంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.

2009 నోటిఫికేషన్‌‌లో 32 పోస్టులు

ప్రొఫెసర్‌‌ లింగమూర్తి కేయూ వీసీగా ఉన్నప్పుడు 2009లో 32 అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ ఇచ్చారు. 2010లో ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేశారు. రిక్రూట్‌‌మెంట్‌‌లో జువాలజీ విభాగంలో అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్లుగా సెలక్ట్‌‌ అయిన చింతా స్రవంతి, రాజేందర్‌‌ నియామకం చెల్లదని కొందరు అభ్యర్థులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు వారి నియామకం అక్రమమని తేల్చింది. రిక్రూట్‌‌మెంట్‌‌ టైంలో పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్‌‌ కౌన్సిల్‌‌(ఈసీ) లేకపోవడం, సెలక్టయిన మిగతా అభ్యర్థులకు ఈసీ ఆమోదం లేకపోవడం, రోస్టర్‌‌, సెలక్షన్‌‌ విషయంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతో ఈ నియామకాలను కూడా రద్దు చేస్తూ ప్రస్తుత ఈసీ నిర్ణయం తీసుకుంది.

2012 నోటిఫికేషన్‌‌లో నలుగురు

ప్రొఫెసర్‌‌ బి.వెంకటరత్నం కేయూ వైస్‌‌ చాన్సలర్‌‌గా ఉన్నప్పుడు ఏర్పాటైన వర్సిటీ ఇంజనీరింగ్‌‌ కాలేజీలో37 పోస్టుల భర్తీకి 2012లో నోటిఫికేషన్‌‌ జారీ చేశారు. 2013లో నిర్వహించిన ఇంటర్వ్యూలపై గవర్నర్‌‌కు, ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఆ టైంలోనూ పూర్తి స్థాయి ఈసీ లేకపోవడంతో పాటు ఫిర్యాదుల వల్ల సెలక్టయిన అభ్యర్థుల జాబితాను వెల్లడించలేదు. తర్వాత కొద్ది నెలలకే ఇంజనీరింగ్‌‌ కాలేజీలో అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్లుగా మేఘనరావు, మహేందర్‌‌, ఆసిఫ్‌‌ ఇక్బాల్‌‌ను ప్రొఫెసర్‌‌గా శ్రీనివాస్‌‌ను నియమించడంపై ఆరోపణలొచ్చాయి.

2014లోనే తేల్చిన విచారణ కమిటీ

నోటిఫికేషన్‌‌లో పోస్టుల గుర్తింపు, రిక్రూట్‌‌మెంట్‌‌పై ఆరోపణలు రావడంతో అప్పటి సర్కారు ఓయూ మాజీ వీసీ సులేమాన్‌‌ సిద్ధిఖీ, తెలంగాణ వర్సిటీ మా జీ వీసీ ప్రొఫెసర్‌‌ కాశీరాం, ఓయూ హిందీ విభాగం రిటైర్డ్‌‌ ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వర్‌‌తో విచారణ కమిటీ వేసింది. నోటిఫికేషన్‌‌, నలుగురి నియామకంపై అధ్యయనం చేసిన కమిటీ.. సెలక్షన్‌‌లో అవకతవకలు జరిగినట్లు తేల్చుతూ 2014, మే 24న నివేదికిచ్చింది.  నివేదికిచ్చి ఐదేళ్లయినా పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్‌‌ కౌన్సిల్‌‌ లేక నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల ఏర్పాటైన ఫుల్‌‌ ఈసీ శుక్రవారం సమావేశమై 2009 నోటిఫికేషన్‌‌లోని 36 పోస్టులను, 2012 నోటిఫికేషన్‌‌లో రిక్రూట్‌‌ అయిన నలుగురితోపాటు మిగతా33 పోస్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.