- క్వశ్చనీర్‌ను జీపీలకు పంపనున్న అధికారులు
- 10 శాఖల నుంచి 575 ప్రశ్నలకు అన్సర్ ఇవ్వనున్న సెక్రటరీలు
- ఎన్నికల కోడ్ ముగియగానే అవార్డుల ప్రక్రియ షురూ
హైదరాబాద్, వెలుగు : ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆగిన పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియ కోడ్ ముగియగానే షురూ కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రెడీ చేసిన క్వశ్చనీర్‌ను రాష్ట్ర పంచాయతీ అధికారులు త్వరలో పబ్లిక్ డొమైన్‌లో ఉంచనున్నారు. పంచాయతీ డెవలప్‌మెంట్ ఇండెక్స్(పీడీఐ)లో గ్రామ పంచాయతీలకు సంబంధించి డిపార్ట్‌మెంట్ల డేటా అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ డేటాను పంచాయతీ అవార్డ్‌లో పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి పంచాయతీ లాగిన్‌లో ఈ ఇండెక్స్ అప్‌లోడ్ చేశాక, పంచాయతీ సెక్రటరీ ఆ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వనున్నారని అధికారులు చెబుతున్నారు. మొత్తం 10 శాఖలకు సంబంధించి క్వశ్చన్లను గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. ఆయా ప్రశ్నలకు గ్రామ పంచాయతీలు ఆన్సర్లు ఇచ్చాక, మండల, జిల్లా స్థాయిలో ఫిల్టర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు పంపుతారు. వాటి ఆధారంగా కేంద్ర అధికారుల బృందం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన డేటాపై సర్వే నిర్వహించి క్రాస్ చెక్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎన్నికలు ముగిసిన తర్వాత స్టార్ట్ అయితే 4 నెలలు టైమ్ పట్టే చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్‌పై ప్రశ్నలు..
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, అగ్రికల్చర్, హౌసింగ్, పోలీస్, సివిల్ సప్లై, మిషన్ భగీరథ అన్ని శాఖలు కలిపి మొత్తం 575 క్వశ్చన్లను కేంద్రం గ్రామ పంచాయతీలకు ఇవ్వనుంది. ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వివిధ కేటగిరీల్లో 46 అవార్డులు, క్యాష్ ప్రైజ్ అందజేస్తోంది. ఈ ప్రాసెస్ ఏటా డిసెంబర్‌లో స్టార్ట్ అవుతుంది. అయితే ఎంపీ ఎన్నికలు జరుగుతున్నందున ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. గత పదేండ్లుగా పంచాయతీ అవార్డ్‌లలో రాష్ట్ర ప్రభుత్వం 10కిపైగా అవార్డులు గెలుచుకుంటుంది. గతేడాది 46 అవార్డులకు వివిధ అంశాలకు సంబంధించి 13 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం సాధించింది.
