న్యూఢిల్లీ: 2026 టీ20 వరల్డ్ కప్ భారత జట్టులో టాలెంటెడ్ ప్లేయర్ సంజు శాంసన్‌కు చోటు దక్కడంపై మాజీ క్రికెటర్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు. తన సోదరుడు శాంసన్ టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక కావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంపైన ఆనందం వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసిన ఓవరాల్ టీమ్ పట్ల అశ్విన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
టీమిండియా టైటిల్ గెలిచేందుకు సిద్ధం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘టైటిల్ డిఫెన్స్ లోడింగ్. అద్భుతమైన జట్టు. స్వ్కాడ్‌లోకి రింకూ తిరిగి రావడం చాలా బాగుంది. నా తంబి సంజు ఎంపిక పట్ల సంతోషంగా ఉంది. అతను ఇప్పుడు అభిషేక్‌తో కలిసి సరిగ్గా ఓపెనింగ్ చేస్తాడు. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్‌కు అభినందనలు’’ అని అశ్విన్ ట్వీట్ చేశారు.
2026 టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టును శనివారం (డిసెంబర్ 20) బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మందితో కూడిన స్వ్కాడ్‌ను ప్రకటించగా.. ఈ జట్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ చోటు దక్కలేదు. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న గిల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఆసియా కప్ 2025 నుంచి టీ20ల్లో గిల్‌ను బలవంతంగా ఓపెనర్‌గా కొనసాగించారు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇటీవలే సౌతాఫ్రికా సిరీస్‌లలో కూడా విఫలమైనప్పటికీ గిల్‌కు వరుస ఛాన్స్‌లు ఇచ్చారు. శాంసన్ లాంటి ఆటగాడిని తప్పించి గిల్‌ను జట్టులో కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బీసీసీఐ కీలకమైన వరల్డ్ కప్ స్వ్కాడ్ నుంచి గిల్‌ను తప్పించి ఎట్టకేలకు సంజు శాంసన్‌ను ఎంపిక చేసింది.
ఇక.. వ్యక్తిగత కారణాలతో అంతర్జాతీయ క్రికట్‌కు దూరమైన ఇషాన్ కిషాన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపాడు. బ్యాటింగ్‌లో రాణించడమే కాకుండా కెప్టెన్‌గా జార్ఖండ్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. తద్వారా టీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్‌లో ఇషాన్ చోటు దక్కించుకున్నాడు.
వరల్డ్ కప్‌కు టీమిండియా స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్ టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా
