క్షేమంగా బయటపడిన కార్మికులంతా ఎయిమ్స్​కు షిఫ్ట్

 క్షేమంగా బయటపడిన కార్మికులంతా ఎయిమ్స్​కు షిఫ్ట్

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులను అధికారులు మెడికల్​అబ్జర్వేషన్ లో ఉంచారు. మొదట మంగళవారం రాత్రి బయటకు తీసుకొచ్చినంక టన్నెల్ లోనే మెడికల్ చెకప్ చేశారు. అనంతరం దగ్గర్లోని చిన్యాలిసౌర్​లోని ఆస్పత్రికి అంబులెన్స్​లలో తరలించారు. అక్కడి నుంచి బుధవారం మధ్యాహ్నం రిషికేశ్​లోని ఎయిమ్స్​కు తీసుకెళ్లారు. 

చినూక్ హెలికాప్టర్​లో 41 మంది కార్మికులను తరలించారు. కార్మికుల బంధువులను కూడా బస్సుల్లో రిషికేశ్​కు తీసుకొస్తున్నారు. ‘‘కార్మికులను ట్రామా వార్డులో ఉంచాం. వాళ్ల హెల్త్ కండీషన్ పూర్తిగా చెక్ చేయాల్సి ఉంది. అలాగే మెంటల్ హెల్త్ ను కూడా పరిశీలించి, సైకియాట్రిక్ ఎగ్జామినేషన్ చేస్తాం. అందుకే అబ్జర్వేషన్ లో ఉంచాం” అని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. కార్మికులను గురువారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ స్టేట్ కోఆర్డినేటర్ అరుణ్ మిశ్రా చెప్పారు.

హ్యాపీగా ఉంది: సీఎం ధామి 

కార్మికులందరూ క్షేమంగా బయటపడినందుకు చాలా ఆనందంగా ఉందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. తనకు మళ్లీ దీపావళి వచ్చిందని పేర్కొన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్​లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఉదయం చిన్యాలిసౌర్​లోని ఆస్పత్రిలో కార్మికులను ధామి పరామర్శించారు. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష చొప్పున చెక్కు అందజేశారు. అలాగే ర్యాట్ హోల్ మైనింగ్ ఎక్స్ పర్ట్స్​కు రూ.50 వేల చొప్పున రివార్డు ఇస్తామని ప్రకటించారు. 

కాగా, కార్మికులు మొదట తమను చూడగానే ఆనందంతో గుండెలకు హత్తుకున్నారని ర్యాట్ హోల్ మైనింగ్ ఎక్స్ పర్ట్స్ ఫిరోజ్ ఖురేషి, మోనూ కుమార్ తెలిపారు. తమను భుజాలపై ఎత్తుకున్నారని, తినడానికి బాదం పలుకులు ఇచ్చారని చెప్పారు. కార్మికులు క్షేమంగా బయటపడిన విషయం తెలిసి ఉత్తరప్రదేశ్ లోని మోతీపూర్​లో క్రాకర్స్ కాల్చారు. టన్నెల్ చిక్కుకున్న కార్మికుల్లో ఈ గ్రామానికి చెందినోళ్లు ఆరుగురు ఉన్నారు.