హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటకు చెందిన మోటపోతుల వంశీ(30) వడదెబ్బతో చనిపోయాడు. వంశీ బుధవారం పెయింటింగ్ పనికి వెళ్లాడు. రోజంతా ఎండలో పని చేయడంతో వడదెబ్బకు గురయ్యాడు. రాత్రి ఇంటి వద్ద అస్వస్థతకు గురవగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు.
వంగపహాడ్లో కౌలు రైతు..
వడదెబ్బతో హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన పొన్నాల భరత్(34) అనే కౌలు రైతు వడదెబ్బతో చనిపోయాడు. కుటుంబ సభ్యులతో కలిసి భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గురువారం వడ్ల బస్తాలు ఎత్తుతుండగా అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ములుగులో గుర్తు తెలియని మహిళ..
ములుగు: ములుగు కొత్త బస్టాండ్ సమీపంలో గురువారం గుర్తు తెలియని మహిళ వడదెబ్బతో చనిపోయింది. 108లో ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి వడదెబ్బతో చనిపోయినట్లు తెలిపారు. మృతురాలికి 55 నుంచి 60 ఏళ్ల వయసు ఉంటుందని ఎస్సై ఉపేందర్ తెలిపారు.
ఇటిక్యాలలో ఉపాధి కూలీ..
అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో వడదెబ్బతో ఉపాధి కూలీ చనిపోయాడు. కొండారెడ్డి(82) గురువారం ఉపాధి పనికి కూలీలతో కలిసి వెళ్లాడు. పనులు చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సిబ్బంది, తోటి కూలీలు అతడిని ఇంటికి చేర్చారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు.
బెల్లంపల్లిలో వృద్ధుడు..
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్కు చెందిన నెలకంటి రామస్వామి(75) అనే వృద్ధుడు గురువారం వడ దెబ్బతో చనిపోయాడు. కొడుకులతో కలిసి టైర్ల షాపు నడుపుతున్న రామస్వామి వడదెబ్బతో చనిపోగా, జనహిత సేవాసమితి అధ్యక్షుడు ఆడెపు సతీశ్, సుకుమార్ కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతరం రామస్వామి నేత్రాలను దానం చేశారు.
పేవోజీపేటలో రైతు..
కడెం: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పేవోజిపేట గ్రామానికి చెందిన కట్ల వెంకన్న(63) వడదెబ్బతో చనిపోయాడు. కట్ల వెంకన్న బుధవారం సాయంత్రం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు వచ్చి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు.
కూలీ పనికి వెళ్లి వస్తుండగా మహిళ..
మొగుళ్లపల్లి: కూలీ పనికి వెళ్లి వస్తుండగా వడదెబ్బకు గురై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన నాంపల్లి సక్కమ్మ (59) చనిపోయింది. భర్త చనిపోయినప్పటి నుంచి కూలీ పని చేసుకుంటూ దివ్యాంగురాలైన కూతురును పెంచుతోంది. ఈక్రమంలో గురువారం ఇప్పలపల్లె గ్రామ శివారులో తోటి మహిళలతో కలిసి పనికి వెళ్లి తిరిగి వస్తూ గ్రామ సమీపంలో కుప్పకూలింది.
కాల్వ గ్రామంలో మహిళ..
నర్సాపూర్(జి): నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన మంద పోసాని(37) గురువారం వడదెబ్బతో చనిపోయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంటోంది. కుటుంబ సభ్యులు గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకొని ఇంటికి తీసుకురాగా, అస్వస్థతకు గురై ఇంటి వద్దనే చనిపోయింది.
