- అర్హుల జాబితాకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం
హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు మహిళలు సహా మొత్తం 92 మంది ఖైదీలకు విముక్తి లభించనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జైళ్లశాఖ రూపొందించిన ప్రత్యేక రిమిషన్(శిక్షాకాలం తగ్గింపు, రద్దు ) జాబితాకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక రిమిషన్ ప్రతిపాదనలపై గవర్నర్ బుధవారం సమావేశం నిర్వహించారు. దీనికి జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖాగోయల్ పాల్గొన్నారు.
ప్రత్యేక రిమిషన్‌కు అర్హులైన వారి జాబితాను పరిశీలించారు. ఇందులో ఆరుగురు మహిళలు సహా మొత్తం 92 మంది ఖైదీలను అర్హులుగా గుర్తించారు. ప్రతిపాదిత జాబితాను గవర్నర్ ఆమోదించి.. ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ ఆదేశాల తర్వాత స్పెషల్ రిమిషన్‌కు అర్హులైన ఖైదీలకు సంబంధించి శిక్షా కాలపరిమితి తగ్గించడం లేదా.. రద్దు చేయడం ద్వారా జైలు నుంచి విడుదల కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం 2024 జూన్ 2న జీవో నంబర్ 37 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో ద్వారా 213 మంది ఖైదీలకు ప్రత్యేక రిమిషన్ మంజూరు అయింది. వీరిలో 178 మంది పురుషులు కాగా 35 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.
ఏటా మూడు సార్లు ప్రత్యేక రిమిషన్
స్పెషల్ రిమిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్ 27న శాశ్వత మార్గదర్శకాలు, కాలపరిమితికి సంబంధించి హోంశాఖ( సర్వీస్–V) జీవో నంబర్ 126 జారీ చేసింది. ఏటా ఫిబ్రవరి 1, జూన్ 1వ తేదీతో పాటు అక్టోబర్ 1 తేదీలను రిమిషన్‌కు కట్-ఆఫ్ తేదీలుగా నిర్ణయించారు. దీని ప్రకారం.. సంవత్సరంలో మూడుసార్లు ప్రత్యేక రిమిషన్ పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు అనుగుణంగా జైళ్ల శాఖ ఈ ఏడాది 2026 ఫిబ్రవరి 1 నాటికి ప్రత్యేక రిమిషన్‌కు అర్హత సాధించిన జీవిత ఖైదీల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ జాబితాను జైళ్ల శాఖ ఐజీ, డీఐజీలతో కూడిన అంతర్గత కమిటీ పరిశీలించింది.హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, జైళ్ల శాఖ డీజీ సభ్యులుగా ఉన్న స్టాండింగ్ కమిటీకి సిఫారసుల కోసం పంపించారు. ఈ సిఫార్సులను సీఎం సహా మంత్రివర్గం పరిశీలించి ఆమోదం తెలిపింది. గవర్నర్ అనుమతి కోసం పంపంచింది.
