జుబేర్‌కు బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ కోర్టు

జుబేర్‌కు బెయిల్ నిరాక‌రించిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ :  ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ‘ఆల్ట్ న్యూస్’ స‌హ వ్యవస్థాప‌కుడు, జర్నలిస్టు మహమ్మద్ జుబేర్ బెయిల్ ద‌ర‌ఖాస్తును ఢిల్లీ కోర్టు శ‌నివారం (జులై 2న) తోసిపుచ్చింది. 2018లో అభ్యంత‌ర‌క‌ర ట్వీట్ కేసుకు సంబంధించి జుబేర్‌ను 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్టడీకి త‌ర‌లించారు. అంత‌కుముందు జుబేర్ అయిదు రోజుల క‌స్టడీ విచార‌ణ ముగియ‌డంతో పోలీసులు ఆయ‌న‌ను కోర్టు ఎదుట హాజ‌రు ప‌రిచారు. మ‌రికొన్ని రోజుల పాటు క‌స్టడీ విచార‌ణ అవ‌స‌ర‌మ‌ని, 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించాల‌ని పోలీసులు కోర్టును కోరారు. కేసు తీవ్రత దృష్ట్యా ఆరోప‌ణ‌ల స్వభావాన్ని ప‌రిగ‌ణన‌లోకి తీసుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేయ‌డం లేద‌ని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ద‌ర్యాప్తులో భాగంగా జుబేర్ మొబైల్ ఫోన్‌, హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్న అనంత‌రం అతడిని జ్యుడిషియ‌ల్ క‌స్టడీకి అప్పగించాల‌ని ఢిల్లీ పోలీసులు కోరారు. మతపరంగా వ్యక్తుల భావోద్వేగాలను దెబ్బతీసేలా గతంలో ట్వీట్ చేసినందుకు జుబైర్‌ను గత నెల జూన్ 27న (సోమవారం) ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

 జుబేర్ కేసులో సంచలన విషయాలు

జర్నలిస్టు మహమ్మద్ జుబేర్ కేసు విచారణలో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆల్ట్‌ న్యూస్‌ కార్యకలాపాలను నిర్వహించే ప్రావ్దా మీడియాకు పాకిస్తాన్, సిరియాతో పాటు ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి విరాళాలు వచ్చినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అనేక సాక్ష్యాలను జుబైర్  ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.