బోరు బావిలో పడిన ఐదేళ్ల బాలుడు

బోరు బావిలో పడిన ఐదేళ్ల బాలుడు

మళ్లీ బోరు బావి ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నారులు అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతమంది చిన్నారులు బలైపోతున్నా.. ప్రజలు మేల్కోవడం లేదు. బోరు వేసిన తర్వాత.. నీరు రాకపోతే.. వెంటనే దానిని మూసివేయాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొంతమంది పట్టించుకోవడం లేదు. దీంతో నూరేళ్ల పాటు బతకాల్సిన చిన్నారులు.. మధ్యలోనే అనంతలోకాలకి వెళ్లిపోతున్నారు. ఇటీవలే గుజరాత్ రాష్ట్రంలో రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్తర్ పూర్ (Chhattarpur) జిల్లాలో ఐదేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

బోరు బావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నారు. దాదాపు 30 ఫీట్ల లోతులో బాలుడున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అతనికి ఆక్సిజన్ అందిస్తున్నారు. రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని GR, DC, Chhatarpur సందీప్ వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం SDERF బృందంతో పాటు పోలీసులు, వైద్యులు సంఘటనాస్థలంలో ఉన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఎమర్జెన్సీ లైట్లను ఏర్పాటు చేశారు. బాలుడు సజీవంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాగర్, జబల్బూర్, గ్వాలియర్ నుంచి మొత్తం 27 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.