కంచె నుంచి కారుపైకి దూకిన చిరుత(వీడియో)

కంచె నుంచి కారుపైకి దూకిన చిరుత(వీడియో)

అస్సాంలోని జోర్హాట్‌లో  ఓ చిరుత వరుస దాడులకు పాల్పడుతూ బెంబేలెత్తిస్తోంది. గడిచిన గత 24 గంటల్లో జోర్హాట్ రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివాసితులతోపాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలపై చిరుత దాడి చేసింది. మొత్తం 15 మందిని గాయపర్చింది. ఇందులో ఐదుగురు అటవీశాఖ సిబ్బంది కూడా ఉన్నారు. అటు  చిరుత కదలికలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. RFRI క్యాంపస్‌లో చిరుత సంచరిస్తుండటంతోపాటు కంచె దూకి ఓ వ్యాన్‌పై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.

చిరుతపులి దాడిలో ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారని జోర్హాట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మోహన్ లాల్ మీనా తెలిపారు. వారిని  స్థానిక ఆసుపత్రిలో చేర్చామన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఎస్పీ  వివరించారు. ఆహారం కోసం చిరుత జోర్హాట్ అటవీ ప్రాంతం నుంచి క్యాంపస్ లోకి చొరబడినట్లు భావిస్తున్నామని జోర్హాట్ ఇన్ చార్జి డీఎఫ్వో రంజిత్ కొన్వర్ తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించినట్లు చెప్పారు. చిరుత కోసం ఉచ్చులు బిగించి .. మత్తుమందు ఇచ్చి దాన్ని బంధించినట్లు తెలుస్తోంది.