దారుణం కదా : వీల్ చైర్ ఇవ్వలేదు.. నడుచుకుంటూ వెళుతూ వృద్దుడు మృతి

దారుణం కదా : వీల్ చైర్ ఇవ్వలేదు.. నడుచుకుంటూ వెళుతూ వృద్దుడు మృతి

ముంబై విమానాశ్రయంలో విషాద ఘటన జరిగింది. ఫ్లైట్ దిగిన తరువాత వీల్ చైర్ ఇవ్వకపోవడంతో  విమానం నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు సుమారు 1.5 కిలోమీటర్లు నడిచిన  80 ఏళ్ల వృద్ద  ప్రయాణికుడు విమానాశ్రయంలో కుప్పకూలి మృతి చెందాడు.

ఆదివారం ( ఫిబ్రవరి 11)  న్యూయార్క్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI -116లో భారతీయ సంతతి దంపతులు... అమెరికా పౌరులు ..ముంబైకి బయలుదేరారు. ఫిబ్రవరి 12న  ముంబై చేరుకున్న తరువాత వీల్ చైర్ కొరత కారణంగా విమానం దిగిన తరువాత, విమానం వద్ద నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు 80 ఏళ్ల వృద్ధుడు నడవడంతో గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలి చనిపోయాడు.

ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగగానే తమకు వీల్ చైర్ కావాలని వారు ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే, వీల్ చైర్ల కొరత కారణంగా, ఆ దంపతుల్లో ఒకరికి మాత్రమే వీల్ చైర్ లభించింది. దాంతో, తన భార్య వీల్ చైర్ లో వెళ్తుండగా, తోడుగా ఆ వృద్ధుడు విమానాశ్రయంలోని ఇమిగ్రేషన్ కౌంటర్ వరకు, దాదాపు 1.5 కిమీల దూరం, నడిచి వెళ్లాడు. దాంతో, ఒక్కసారిగా అలసిపోయి, గుండె పోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ముంబై ఎయిర్‌పోర్టులోని మెడికల్‌ ఫెసిలిటీకి తరలించారు. నానావతి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఎయిర్ ఇండియా స్పందన 

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఫిబ్రవరి 12 న న్యూయార్క్ నుండి ముంబైకి విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో  ఒకరు వీల్ చైర్లో ఉన్న తన భార్యతో ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేయడానికి వెళుతుండగా అస్వస్థతకు గురయ్యారు. వీల్ చైర్ లకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున, వీల్ చైర్ సహాయం అందించే వరకు వేచి ఉండమని మేము ఆ ప్రయాణికుడిని అభ్యర్థించాము. కాని అతను తన జీవిత భాగస్వామితో కలిసి నడుచుకుంటూ వెళ్లాడని తెలిపింది. అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు విమానాశ్రయ వైద్యులు తెలిపారని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. 

సీనియర్స్ సిటీజన్స్, వైద్య పరిస్థితి ఉన్నవారికి వీల్ చైర్ కేటాయించాల్సి ఉంటుంది. వీల్ చైర్ అవసరమయ్యే వైద్యపరంగా ఫిట్ కాని ప్రయాణికులు వైద్య సమాచార ఫారమ్‌ను పూరించి సమర్పించాలి. వైద్యుడు పూరించిన ఫారమ్‌ను సమీపంలోని ఎయిర్ ఇండియా కార్యాలయంలో సమర్పించవచ్చు. దీని తరువాత, ఎయిర్ ఇండియా మెడికల్ ఆఫీసర్ అభ్యర్థనను మంజూరు చేయడానికి కనీసం 72 గంటలు పడుతుంది. కెనడా వంటి కొన్ని కార్యాలయాల్లో, ఐదు పని దినాలు పడుతుంది. అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు అక్కడక్కడ వెలుగుచూస్తుండటం గమనార్హం