స‌త్యేంద్ర జైన్‌కు సీబీఐ న్యాయ‌స్థానం బెయిల్ నిరాక‌ర‌ణ‌

స‌త్యేంద్ర జైన్‌కు సీబీఐ న్యాయ‌స్థానం బెయిల్ నిరాక‌ర‌ణ‌

ఢిల్లీ : నగదు అక్రమ చలామణి కేసులో ఆప్ నేత‌, ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ కు సీబీఐ ప్రత్యేక న్యాయ‌స్థానం బెయిల్ నిరాకరించింది. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30వ తేదీన స‌త్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా.. దానిని జూన్ 13వ తేదీ వరకూ పొడిగించింది. ప్రస్తుతం మంత్రి సత్యేంద్ర జైన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 

గత మంగళవారం జైన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్.. తుది ఉత్తర్వులను జూన్ 18వ తేదీకి రిజర్వ్ చేశారు. శనివారం (జూన్ 18న) బెయిల్ అభ్యర్థనను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. 

2015, 16లో హవాలా నెట్ వర్క్ ద్వారా సత్యేంద్ర జైన్ కంపెనీలకు షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే మంత్రి సత్యేంద్ర జైన్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.