ప్రపంచ అత్యుత్తమ జట్టుగా వర్ణన.. పాక్ క్రికెట్ చైర్మన్‌ను తిడుతున్న అభిమానులు

ప్రపంచ అత్యుత్తమ జట్టుగా వర్ణన.. పాక్ క్రికెట్ చైర్మన్‌ను తిడుతున్న అభిమానులు

నలుగురిలో నవ్వులు పాలు కావాలన్నా.. తమ చేష్టలు చర్చనీయాంశం అవ్వాలన్నా.. ఒక్క పాకిస్తాన్‌కే చెందుతుంది. అలాంటి వాటికి ఇదొక చక్కని ఉదాహరణ. పాము పిల్లను.. అనకొండను వధించినంతలా ఫీలయ్యారు. చిన్న జట్టును ఓడించి.. వరల్డ్ కప్ సాధించినంతలా సంబరాలు చేసుకున్నారు. ఆ చేష్టలపై ఆ దేశ క్రికెట్ అభిమానులు అప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తన ట్వీట్‌తో ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశారు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ వెళ్లిన పాక్ జట్టు.. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తొలి టీ20లో ఓడినప్పటికీ.. తరువాత పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ చేజిక్కించుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో నానా హడావిడి చేశారు. కేక్ కటింగ్‌లతో నానా రచ్చ చేశారు. ఆ సంబరాలపై ఆ దేశ మాజీ క్రికెటర్లు అప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా, పీసీబీ చైర్మన్ తన ట్వీట్‌తో దానిని మరింత పెద్దది చేశారు.  

ఐర్లాండ్‌పై సిరీస్ విజయాన్ని అందుకున్న పాకిస్తాన్ జట్టును నఖ్వీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా వర్ణించారు. ఇది ఆ దేశ క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో అతన్ని ఉర్దూ భాషలో మాటల్లో చెప్పలేనంతలా తిడుతున్నారు.

"ఐర్లాండ్‌తో సిరీస్ గెలిచినందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అభినందనలు! టీమ్‌వర్క్, అంకితభావంతో మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా నిరూపించబడ్డారు. అబ్బాయిలూ తదుపరి ఇంగ్లాండ్ సిరీస్, ప్రపంచ కప్‌ ఆడబోతున్న మీకు శుభాకాంక్షలు!" అని నఖ్వీ ట్వీట్ చేశారు. అతని ట్వీట్‌కు వస్తున్న కామెంట్లు చూస్తే.. ఏ ఒక్కటి ప్రశంసిస్తున్నట్లు లేదు. భాష అర్థం కాకపోయినా.. వారి భావాన్ని అర్థం చేసుకొని నెటిజెన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.