ఆమిర్ ఖాన్ మూడో భార్యను వెతుకుతున్నడు

ఆమిర్ ఖాన్ మూడో భార్యను వెతుకుతున్నడు
  • ఇలాంటోళ్ల వల్లే జనాభా పెరుగుదల
  • బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ పై బీజేపీ ఎంపీ కామెంట్

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌పై బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా విపరీతంగా పెరగడానికి ఆమిర్ ఖాన్ లాంటి వ్యక్తులే కారణమని కామెంట్ చేశారు. రెండో భార్య నుంచి విడాకులు తీసుకున్నందుకు ఆమిర్ ఖాన్‌ ఏమాత్రం బాధపడటం లేదని, మూడో భార్యను వెతుక్కునే పనిలో పడ్డాడని గుప్తా అన్నారు. మధ్యప్రదేశ్ లోని మాదాసౌర్ నియోజకవర్గం ఎంపీ అయిన సుధీర్ గుప్తా.. ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగం ఒక్క అంగుళం కూడా పెరగలేదని, జనాభా మాత్రం 140 కోట్లకు చేరుకుందని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు అత్యంత విశాలమైన భూభాగం దక్కిందని, కానీ ఆ ప్రాంతంలో ఉన్న జనాభా చాలా తక్కువని చెప్పారు. పైగా ఆ సమయంలో పాక్‌ నుంచి భారత్‌కు భారీగా ప్రజలు వలస వచ్చారని, దానికి తగ్గట్టు భూభాగం మాత్రం మనకు దక్కలేదని సుధీర్ గుప్తా అన్నారు. ‘‘బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్.. తొలి భార్య రీనాతో ముగ్గురు పిల్లల్ని కన్నాడు. రెండో భార్య కిరణ్‌రావ్‌తో ఒక కొడుకును కన్నాడు. వాళ్లను వదిలేసి ఇప్పుడు ఏ మాత్రం బాధ లేకుండా మూడో భార్య కోసం వెతుక్కుంటున్నాడు ”అని అన్నారు. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా ఆమిర్‌‌ ఖాన్ లాంటి వాళ్ల వల్లే దేశంలో జనాభా సమతుల్యత దెబ్బతింటోందని,  ఆయన లాంటి వ్యక్తులకు పిల్లల్ని కనడం తప్ప మరో పని చేసేంత బుర్ర లేదని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కానీ భారత్‌కు జనాభా నియంత్రణ విధానం అవసరమని, ఇలాంటి అస్తవ్యస్తమైన జనాలు కాదని అన్నారు.