కొత్తూరు మండలంలోని కంపెనీని 7.9 కోట్లు ముంచిన అకౌంటెంట్

కొత్తూరు మండలంలోని కంపెనీని 7.9 కోట్లు ముంచిన అకౌంటెంట్
  •     వెండర్లకు పంపకుండా తన ఖాతాలోకి మళ్లింపు

షాద్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు: ఓ కంపెనీలో పనిచేసే అకౌంటెంట్​ అక్రమంగా తన ఖాతాకు కోట్ల రూపాయలు మళ్లించుకున్నాడు. వాటిని షేర్​ మార్కెట్​ పెట్టుబడి పెట్టి పోగొట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఆర్‌‌‌‌ఎం కన్వర్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వెలుగుచూసింది. గురువారం షాద్‌‌‌‌నగర్ డీసీపీ శిరీష కేసు వివరాలు వెల్లడించారు. కంపెనీ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న హనుమాన్ల లక్ష్మణ్ ఆరు నెలలుగా వెండర్లకు పంపాల్సిన డబ్బులను వారికి పంపినట్లు రికార్డుల్లో చూపిస్తూ తన ఖాతాకు మళ్లించుకుంటున్నాడు. ఈ విధంగా రూ.7.90 కోట్లకు పైగా అక్రమంగా తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇటీవల కంపెనీ డైరెక్టర్ రికార్డులను పరిశీలించగా మోసం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కొత్తూరు సీఐ నర్సయ్య విచారణ చేపట్టగా మోసం బయటపడింది. నిందితుడి ఖాతా నుంచి రూ.1.47 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.2.60 లక్షల నగదు, రెండు స్మార్ట్‌‌‌‌ఫోన్లు కూడా సీజ్ చేశారు. మిగతా డబ్బును షేర్ మార్కెట్‌‌‌‌లో పెట్టుబడిగా పెట్టి నష్టపోయినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. గతంలో జూబ్లీహిల్స్‌‌‌‌, చందానగర్ ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.