ఢిల్లీ విద్యార్థిని ఘటన : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు మహిళా కమిషన్ నోటీసులు

ఢిల్లీ విద్యార్థిని ఘటన : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు మహిళా కమిషన్ నోటీసులు

ఢిల్లీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన నేపథ్యంలో ఆన్ లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫామ్స్  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అత్యంత సులభంగా యాసిడ్ విక్రయించడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకు ముందు ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ విచారం వ్యక్తం చేశారు.  ఇలాంటి ఘోరాలు జరగకుండా యాసిడ్ అమ్మకంపై నిషేధం విధించాలని తాము ఎప్పటి నుంచో పోరాడుతున్నా,  ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వాలు ఇంకెప్పుడు మేల్కొంటాయని ప్రశ్నించారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్న ఆయన.. నిందితులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను కఠినంగా శిక్షిస్తామని, ఢిల్లీలోని ప్రతి బాలిక రక్షణ తమకు ముఖ్యమేనని ట్వీట్ చేశారు. 

ఢిల్లీలో  బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు.. ఇంటి నుంచి నడుచుకుంటూ స్కూల్​కు వెళ్తున్న బాలిక(17)పై యాసిడ్​తో దాడి చేశారు. తీవ్రగాయాలైన ఆమె ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతోంది. ఈ ఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏరియాలో బుధవారం జరిగింది. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు కావడంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధిత బాలిక తన చెల్లి(13)తో కలిసి ఉదయం స్కూల్​కు బయల్దేరింది. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై ఇద్దరు దుండగులు వచ్చారు. ఆ అమ్మాయిల దగ్గరికి వచ్చాక బైక్ ను కొంచెం స్లో చేయగా, వెనుక కూర్చున్న వ్యక్తి బాలికపై యాసిడ్ పోసి పరారయ్యారు. యాసిడ్  పెద్దమ్మాయి ముఖంపై పడడంతో పరుగులు పెట్టింది. స్థానికులు ఆమెను సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ముఖంపై 8 శాతం కాలిన గాయాలయ్యాయని, ఆమె కండ్లపైనా ఎఫెక్ట్ పడిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూ ట్రీట్ మెంట్ అందిస్తున్నామని బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.