
- ఆ పార్టీలు సిటిజన్ షిప్ చట్టంపై అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నయ్
- హిందువులు, సిక్కులు, బౌద్ధులు దేశ విభజనకు బాధితులు
- వాళ్లు రెఫ్యూజీలుగా వస్తే కాంగ్రెస్ పట్టించుకోలేదన్న ప్రధాని
ఆజమ్గఢ్/ భదోహీ/ జౌన్పూర్(యూపీ) : కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లు సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్(సీఏఏ)పై అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. ‘‘మీరు ఏం కావాలంటే అది చేసుకోండి. కానీ మీరు ఎన్నటికీ సీఏఏను తొలగించలేరు” అని ఆయన తేల్చిచెప్పారు. ‘‘సీఏఏ కింద శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే పని ఆల్రెడీ స్టార్ట్ అయింది. వీళ్లంతా హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు. వీళ్లు చాలా కాలం నుంచి దేశంలో రెఫ్యూజీలుగా నివసిస్తున్నారు. మతం ఆధారంగా జరిగిన దేశ విభజనకు వీరంతా బాధితులుగా మారారు. కానీ కాంగ్రెస్ వీరిని నిర్లక్ష్యం చేసింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం యూపీలోని ఆజమ్ గఢ్, భదోహీ, ప్రతాప్ గఢ్, జౌన్ పూర్ లోక్ సభ సెగ్మెంట్లలో ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. ‘‘సీఏఏను తొలగిస్తామని ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. కానీ ఎవరూ దానిని తొలగించలేరు. మీరు మోసగాళ్లు. దేశం మత ఘర్షణల మంటల్లో తగలబడేలా చేయాలని చూశారు” అని ప్రతిపక్ష కూటమిపై మోదీ ఫైర్ అయ్యారు. వేలాది మంది రెఫ్యూజీలకు పౌరసత్వం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. యూపీలో గత ఎస్పీ ప్రభుత్వం టెర్రరిస్టులకు క్షమాభిక్ష పెట్టిందని, స్లీపర్ సెల్స్‌కు రాజకీయంగా అండగా నిలిచిందని విమర్శించారు. ఎస్పీ, కాంగ్రెస్ రెండింటిదీ ఒకే దుకాణమని.. బుజ్జగింపులు, అబద్ధాలు, కుటుంబవాదం, అవినీతిని అమ్మడమే వాటి పని అని ఎద్దేవా చేశారు.
జూన్ 4 తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నం
దేశానికి ఐదేండ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులను నియమించాలని ఇండియా కూటమి భావిస్తోందని, కానీ జూన్ 4 తర్వాత ఆ కూటమి విచ్ఛిన్నం కావడం ఖాయమని మోదీ అన్నారు. ‘‘జూన్ 4 తర్వాత చాలా విషయాలు జరుగుతాయి. కూటమి ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలా? అంటూ ఒక బలిపశువు కోసం వాళ్లు వెతుక్కుంటారు. అలాగే లక్నో, ఢిల్లీ యువరాజులు (అఖిలేశ్, రాహుల్ గాంధీ) సమ్మర్ వెకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లిపోతారు” అని ఆయన ఎద్దేవా చేశారు. భారత్ బలాన్ని ప్రపంచానికి చాటేలా ఒక బలమైన ప్రభుత్వాన్ని నడిపే నేతను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు ఇవి అని మోదీ అన్నారు.
బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే.. ఆ ఓటు నేరుగా తన ఖాతాలో పడినట్టేనని చెప్పారు. ‘‘మనం 500 ఏండ్ల ఎదురుచూపుల తర్వాత రామ మందిరం కట్టుకున్నాం. కానీ ఎస్పీ యువరాజు(అఖిలేశ్) మాత్రం రామ మందిరాన్ని యూజ్ లెస్ అంటున్నారు. కాశీపై కూడా ఇలాంటి కామెంట్లే చేస్తున్నారు. తమ ఓటు బ్యాంకును సంతృప్తిపర్చడం కోసం వాళ్లు హద్దులు దాటుతున్నారు” అని మోదీ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా సభ మొత్తం జై శ్రీరామ్, హర్ హర్ మోదీ అంటూ నినాదాలతో దద్దరిల్లింది. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘‘మీ ఉత్సాహం చూస్తుంటే.. యూపీలో ఇండియా కూటమికి ఒక్క సీటు కూడా వచ్చేలా లేదు” అంటూ చమత్కరించారు.
యూపీలోకి ‘టీఎంసీ’ పాలిటిక్స్ తెస్తున్రు
బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ మాదిరిగా యూపీలోనూ మైనార్టీలకు బుజ్జగింపులు, దళితులు, మహిళలపై వేధింపులతో కూడిన రాజకీయాలను తేవాలని ఎస్పీ, కాంగ్రెస్ చూస్తున్నాయని మోదీ అన్నా రు. యూపీలోని భదోహీ లోక్ సభ స్థానంలో టీఎంసీ అభ్యర్థిని బరిలోకి దింపడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. బెంగాల్‌లోని టీఎంసీ పాలిటిక్స్‌ను యూపీలోనూ ట్రయల్ చేసి చూస్తున్నారని విమర్శిం చారు. రామ మందిరం అంటే మలినమని చెప్పడం, రామనవమి వేడుకలు బ్యాన్ చేయడం, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆశ్రయం, ఓటు జిహాద్‌కు పిలుపునివ్వడంమే టీఎంసీ పాలిటిక్స్ అని విమర్శించారు.