ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. ఇప్పటికే 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది ఈ క్రేజీ జోడీ .. ఇప్పుడు నాలుగోసారి వీరు చేతులు కలపబోతున్నారు. అయితే ఈ సారి వారు ప్లాన్ చేస్తోంది మాములు సినిమా కాదు. ఇండియన్ సినిమా హిస్టరిలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒక భారీ పౌరాణిక గాథ చిత్రం.
కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్!
ఈ సినిమా గురించి అత్యంత ఆసక్తికరమైన అంశం ఒకటి సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సుమారు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అత్యాధునిక సాంకేతికతతో భారతీయ పురాణాలలోని ఒక అద్భుత ఘట్టాన్ని త్రివిక్రమ్ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపుదిద్దుతున్నారు.
అల్లు అర్జున్ కోసం ప్రత్యేక స్క్రిప్ట్
త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలోనూ బన్నీని కొత్తగా చూపిస్తారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని, ఆయన బాడీ లాంగ్వేజ్ , మేకోవర్ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. 'పుష్ప' సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, త్రివిక్రమ్ ఒక ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ మైథలాజికల్ డ్రామాను సిద్ధం చేశారని సమాచారం..
ప్రస్తుత ప్రాజెక్ట్స్ , షెడ్యూల్
ప్రస్తుతం అల్లు అర్జున్ తన 22వ సినిమాను స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బన్నీకి సోదరి పాత్రలో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. అట్లీ సినిమా పూర్తికాగానే, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ 2027 ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' నాన్-బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఈ పౌరాణిక చిత్రం అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
గీతా ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన మరికొద్ది వారాల్లో వెలువడనుంది. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, అల్లు అర్జున్ నటన తోడైతే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలైనట్లే అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
