- ఢిల్లీలోని బంగ్లాదేశ్‌హైకమిషన్‌వద్ద వీహెచపీ, బజరంగదళ్‌ఆందోళనలు
- ‘భారత్ మాతా కీ జై’.. ‘హిందువుల హత్యలు ఆపండి’ అంటూ నినాదాలు
- యూనస్ సర్కార్ మేల్కోవాలని డిమాండ్
- యూనస్ దిష్టిబొమ్మ దహనం.. నిరసనకారులపై లాఠీచార్జ్
- పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య, హిందువులపై దాడిని ఖండిస్తూ ఢిల్లీలో నిరసనలు మిన్నంటాయి. బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘భారత్ మాతా కీ జై’, ‘యూనస్ సర్కార్ హోష్ మే ఆవో’ (యూనస్ సర్కారు మేల్కోవాలి)’, ‘హిందువుల హత్యలు ఆపండి’ అంటూ నినదించారు.
‘జస్టిస్ ఫర్‌దీపు దాస్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నిరసనకారులు అక్కడ బారికేడ్లను తోసుకుంటూ హై కమిషన్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ దిష్టిబొమ్మను నిరసనకారులు దహనం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చి వారిని పునరావాసం కల్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా, నిరసనల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. హైకమిషన్ ప్రాంతంలో ఏడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 1,500 మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు.
జమ్మూలో ఆందోళనలు..
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యకు నిరసనగా జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది.
ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు పూర్తి రక్షణ కల్పించాలి లేదా వారిని భారతదేశానికి తీసుకురావాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిర్మల్ కె. కొత్వాల్ డిమాండ్ చేశారు.
కోల్‌కతాలో బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం ముట్టడి బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిరసనలు జరిగాయి. ఒక హిందూత్వ సంస్థకు చెందిన వందలాది మంది మద్దతుదారులు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణతో సెంట్రల్ కోల్‌కతాలోని బెక్ బగన్ ప్రాంతం రణరంగంగా మారింది. ‘బొంగియో హిందూ జాగరణ్ మంచా’ ఆధ్వర్యంలో 'హిందూ హుంకర్ పాదయాత్ర' పేరుతో సీల్దా నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వైపు దూసుకెళ్తున్న నిరసనకారులు పోలీసు బారికేడ్లను దాటడానికి ప్రయత్నించారు.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి , ఆందోళనకారులను చెదరగొట్టారు.ఈ ఘటనలో సుమారు 12 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. తోపులాటలో పలువురు పోలీసులు, ఆందోళనకారులకు స్వల్ప గాయాలయ్యాయి.
