సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. నాలుగు లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. క్యాంపెయిన్‌లో భాగంగా నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. కాలే నాగ్, బిగ్డా షెహజాదా, హుస్న్పరి అంటూ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నరు. అభ్యర్థుల వ్యవహారశైలి, మనస్తత్వం, బ్యాక్‌గ్రౌండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నరు. పర్సనల్ లైఫ్‌ను రాజకీయాల్లోకి లాగుతున్నరు. రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం శాంతా కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు చేస్తున్న కామెంట్లపైనా అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై సీఎం కామెంట్లు
నేతలు చేస్తున్న కామెంట్లు రాష్ట్ర సంస్కృతికి విరుద్ధమన్న సీఎం సుఖు.. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌కు ఓటింగ్‌కు పాల్పడిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నరు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను కాలే నాగ్ (నల్ల తాచు), బికావు (అమ్ముడుపోయినవాడు) అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘బికావు వర్సెస్ టికావు’ (అమ్ముడు పోయిన వాళ్లకు, స్థిరంగా ఉన్నవాళ్లకు) మధ్య ఎన్నికలు జరుగుతున్నాయంటూ విమర్శలు ఎక్కుపెడ్తున్నరు. ‘‘భుట్టో కో ఖూటో”(భుట్టోను కొట్టండి) అంటూ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే దేవేందర్ కుమార్ భుట్టోను ఉద్దేశిస్తూ కుల్తేర్లో నిర్వహించిన క్యాంపెయిన్ ర్యాలీలో సీఎం విమర్శించారు.
‘మండిలో రేటెంత?’ అంటూ పోస్టులు..
మండి లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. కంగనా ఫొటో షేర్ చేసి దానికింద ‘‘మండిలో రేటు ఎంత నడుస్తున్నది’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. మండి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న విక్రమాదిత్యపై కంగనా చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. రాహుల్ ‘పెద్ద ముద్దపప్పు’.. విక్రమాదిత్య ‘చిన్న ముద్దపప్పు’ అంటూ విమర్శించింది.
గాంధీ ఫ్యామిలీని చెద పురుగులతో పోల్చిన కంగనా
మాజీ ప్రధాని నెహ్రూ, అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఫ్యామిలీ లక్ష్యంగా కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. గాంధీ ఫ్యామిలీ అంతా బ్రిటీష్ వాళ్లు వదిలివెళ్లిన రోగాలు, చెద పురుగులు అంటూ కామెంట్లు చేసింది. 2014 దాకా దేశాన్ని తినేశారని విమర్శించారు. విక్రమాదిత్యను ఉద్దేశిస్తూ.. చెడిపోయిన యువరాజు అంటూ కంగనా కామెంట్లు చేశారు. కంగనా ఓ ‘పరి’ అంటూ మండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న విక్రమాదిత్య తల్లి ప్రతిభా సింగ్ విమర్శించారు. ఓ కూతురుకు తల్లి అయిఉండీ ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్రతిభా సింగ్‌కు కంగనా తల్లి ఆషా రనౌత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
