
కామెడీ సినిమాలతో నవ్వించడమే కాదు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో నటుడిగానూ మెప్పించగలనని ‘నాంది’ చిత్రంతో మరోసారి నిరూపించాడు అల్లరి నరేష్. కొంతకాలంగా తన కొత్త చిత్రాల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న నరేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సతీష్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. నరేష్ కెరీర్లో ఇది యాభై ఎనిమిదవ చిత్రం. ఇక పోస్టర్లో స్టేజీపై మైక్ ముందు నిలబడ్డ నరేష్, రెండు చేతులు జోడించి ‘సభకు నమస్కారం’ చేస్తూ కనిపించాడు. తన ప్యాంట్ పాకెట్స్‌లో డబ్బు, లిక్కర్ బాటిల్ కనిపిస్తున్నాయి. టైటిల్, ఫస్ట్ లుక్‌ని బట్టి ఇదో పొలిటికల్ సెటైర్ మూవీ అని అర్థమవుతోంది. ఇలాంటి జానర్లో నరేష్ సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. సెప్టెంబర్ నుండి సెట్స్‌కి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. రొటీన్ సినిమాలు తగ్గించి, కొత్త తరహా సినిమాలు చేస్తానన్న నరేష్, తు.చ. తప్పకుండా దాన్ని ఫాలో అవుతున్నట్టు అర్థమవుతోంది. ఇక రెండేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ‘సభకు నమస్కారం’ టైటిల్‌తో సినిమా రాబోతున్నట్టు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడిదే టైటిల్‌తో నరేష్ వస్తుండటం విశేషం.