వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌‌తో సర్కార్ సేఫ్

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌‌తో సర్కార్ సేఫ్

యూపీ గవర్నమెంట్‌పై మండిపడిన అఖిలేశ్ యాదవ్ 

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌‌పై ఉత్తర్‌‌ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ఉజ్జయినిలో మధ్యప్రదేశ్‌ పోలీసులకు పట్టుబడిన దూబేను యూపీకి తీసుకురావడానికి స్థానిక పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో దూబేను తీసుకొని తిరిగి వస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ వెహికిల్ బోల్తా పడింది. దీంతో దూబే తప్పించుకోవడానికి యత్నించడంతో పోలీసులు అతడ్ని కాల్చేశారు. దీనిపై అఖిలేశ్ ట్విట్టర్ వేదికగా సర్కార్‌‌ను పలు ప్రశ్నలు వేశారు.

‘కారు బోల్తా పడలేదు. కానీ ఈ ఓవర్‌‌టర్నింగ్‌తో తన రహస్యాలను కాపాడుకోవడంలో ప్రభుత్వం సేఫ్ అయింది’ అని అఖిలేశ్ ట్వీట్ చేశారు. దూబేను తీసుకెళ్తున్న కారు బోల్తా పడిందని, ఇదే అదనుగా అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఎస్‌టీఎఫ్​ అధికారులు తెలిపారు. యాక్సిడెంట్ తర్వాత ఓ పోలీసు నుంచి దూబే ఆయుధాన్ని తీసుకున్నాడని, సరెండర్ అవ్వమని చెప్పినా వినలేదని దీంతో కాల్పులు జరిపామన్నారు. సెల్ఫ్‌ డిఫెన్స్‌లో భాగంగానే దూబేపై పోలీసులు కాల్పులు జరిపారని అధికారులు స్పష్టం చేశారు.