భారత్ వైమానిక దళాధిపతి (IAF) ఎయిర్ ఛీప్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియాకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అమెరికాలోని పెరల్ హార్బర్ నేవీ షిప్ యార్డ్ లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయానికి భదౌరియా బృందం అక్కడే ఉంది. కాల్పుల ప్రదేశానికి అదృష్టవశాత్తు కాస్త దూరంగా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి యూఎస్ నేవీలో పనిచేస్తున్న సెయిలర్ గా గుర్తించారు. అయితే అతను ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడన్నది తెలియరాలేదు.
పసిఫిక్ ఎయిర్ చీఫ్స్ సదస్సు (PACS-2019)లో భాగంగా భదౌరియా టీం అక్కడికి వెళ్లింది.ఈ సదస్సులో వరల్డ్ వైడ్ గా వివిధ దేశాలకు చెందిన వైమానిక దళ చీఫ్‌లు పాల్గొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో అందరూ అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనలో వీరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని IAF తెలిపింది. ఈ ఘటన తర్వాత PACS-2019 యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు అధికారులు.

