హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. శుక్రవారం (మార్చి 27) ఉదయం నుంచి నగరంలో ఎండ దంచికొట్టగా.. రాత్రి వేళ సిటీ మొత్తం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎర్రమంజిల్, సోమాజిగూడ, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, ఆల్వాల్, దమ్మాయిగూడ, నేరేడు మెట్, మేడ్చల్, ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్, వనస్థలిపురం, అబ్దుల్లా పూర్ మెట్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, సూరారం, చింతల్, షాపూర్ నగర్, బహదూర్పల్లి, దుండిగల్, మల్లంపేట, గండి మైసమ్మ, గాజులరామారం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఒక్కసారిగా వర్షం కురువడంతో శ్రీరామ నవమి పురస్కరించుకుని సిటీలోని పలుప్రాంతాల్లో నిర్వహించిన శోభాయాత్రలకు ఆటంకం ఏర్పడింది. వర్షపు నీరు భారీగా రోడ్లపైకి చేరడంతో నగరంలోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహయక చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి భానుడి ప్రతాపానికి అల్లాడిపోయిన నగరవాసులు రాత్రి వేళ కురిసిన వర్షంతో సేద తీరుతున్నారు.
