మొబైల్ రీచార్జ్‌ రేట్లు పెరుగుతున్నయ్‌

మొబైల్ రీచార్జ్‌ రేట్లు పెరుగుతున్నయ్‌

న్యూఢిల్లీ: ఎయిర్‌‌టెల్,  వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్ల రేట్లను వచ్చే నెల నుంచి పెంచుతున్నాయి. ఎయిర్‌‌టెల్ ఇప్పటికే తన ఎంట్రీ లెవల్ నెలవారీ ప్రీపెయిడ్ రూ .49 రీచార్జ్‌‌ ప్యాక్‌‌ను రద్దు చేసింది. బేస్ లెవల్ ప్లాన్ ఇప్పుడు రూ .79 అయింది. అంటే 60 శాతం పెరిగింది. పోస్ట్‌‌పెయిడ్, కార్పొరేట్ కస్టమర్ల కోసం ఎంట్రీ లెవల్ ప్లాన్ రేట్లను కూడా 30 శాతం పెంచింది. వొడాఫోన్ ఐడియా బేసిక్ ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు చేస్తోంది.  కొన్ని సర్కిల్‌‌లలో బేస్ రీఛార్జ్ ధరలను మార్చింది. మహారాష్ట్ర  గుజరాత్‌‌లో రూ.49 ప్లాన్ గడువును 28 రోజులకు బదులు 14 రోజులకు తగ్గించింది.  28 రోజుల ప్లాన్ కోసం ఇక నుంచి రూ. 79 ప్యాక్‌‌తో  రీచార్జ్ చేసుకోవాలి. ఈ కంపెనీ త్వరలో దేశమంతటా ప్రీ-పెయిడ్ ప్లాన్ల రీచార్జ్  రేట్లను పెంచుతుందని తెలుస్తోంది.   ఏజీఆర్ బకాయిలను తీర్చడానికి, నగదు నిల్వలను పెంచడానికి టెల్కోలు రేట్లను పెంచుతున్నాయి.  ఈ ఏడాది మార్చి 22 నాటికి వొడాఫోన్ ఐడియా,  ఎయిర్‌‌టెల్ ఏజీఆర్ బకాయిలుగా వరుసగా రూ .9 వేల కోట్లు,  రూ .4,100 కోట్లు చెల్లించాలి.  ఎయిర్‌‌టెల్ కు ఈ ఏడాది జూన్‌‌ నాటికి 34.82 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వొడాఫోన్ ఐడియాకు 27.76 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఏజీఆర్‌  బకాయిలు మరీ ఎక్కువగా ఉన్నాయని, వీటిని మరోసారి లెక్కించాలంటూ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు చేసిన పిటిషన్‌ను ఈ నెల 23న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏజీఆర్​కు సంబంధించిన పిటిషన్లన్నింటినీ డిస్మిస్‌ చేస్తున్నట్టు జస్టిస్ నాగేశ్వరరావు నాయకత్వంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. ఏజీఆర్‌ విషయంలో ఇదే తమ ఆఖరు నిర్ణయమని పేర్కొంది. బకాయిల చెల్లింపునకు పర్సనల్‌ గ్యారంటీ ఇవ్వాలని టెల్కోలను ఆదేశించింది.