రాజ్యాంగం వచ్చాకే అందరికి సమాన హక్కులు

రాజ్యాంగం వచ్చాకే అందరికి సమాన హక్కులు
  • స్టేట్ హెచ్ఆర్ సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య

ఓయూ, వెలుగు: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే దేశంలోని ప్రజలకు సమాన హక్కులు వచ్చాయని, అంతకుముందు వర్ణ, కుల ఆధారంగానే న్యాయం జరిగేదని స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య పేర్కొన్నారు. సోమవారం ఓయూ లా ఫ్యాకల్టీ డీన్  ప్రొఫెసర్  గాలి వినోద్ కుమార్ అధ్యక్షతన ‘భారత రాజ్యాంగం – అనుభవాలు, జనాల భవిష్యత్​’ అంశంపై జరిగిన ప్రారంభ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనదేశంలో ప్రజల సమస్యలకు రాజ్యాంగం పరిష్కారం చూపుతుందని, కానీ పాలకులకు చిత్తశుద్ధి లేని కారణంగా 75 ఏళ్లుగా 10 శాతం   కూడా లక్ష్యం నెరవేరలేదన్నారు. 

సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ఎంత గొప్పదైనా పాలకులు చెడ్డవారైనప్పుడు వచ్చే ఫలాలు కూడా చెడ్డవి అవుతాయని పేర్కొన్నారు. అది రాజ్యాంగం తప్పు కాదని పాలకులది మాత్రమేనని రాజ్యాంగనిర్మాత అంబేద్కర్  పార్లమెంటు సభల్లో  తన ప్రసంగంలో వెల్లడించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ కౌన్సిలర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి , యూజీసీడీ ప్రొఫెసర్ జి. మల్లేశం, సీనియర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి పాల్గొనగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నితిన్ మిశ్రమం కీలక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో 50 కి పైగా వర్సిటీల అధ్యాపకులు పరిశోధక 75 పరిశోధన పత్రాలు సమర్పించగా 55 పరిశోధక పత్రాలను పుస్తక రూపంలో ప్రచురించారు.