హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది

హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత..  ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది

మందు ప్రియులు.. రోజూ ఎలా ఉన్నా.. సమ్మర్ లో మాత్రం సాయంత్రం పూట చిల్లుగా ఓ బీర్ వేద్దామనుకునే వారు ఎక్కువ. రెగ్యులర్ గా తాగేవాళ్లే కాదు.. అప్పుడప్పుడు తాగే మందు ప్రియులు సైతం సమ్మర్ వచ్చిందంటే చాలు.. సాయంత్రం చిల్ బీరు కోసం తహతహలాడతారు. మొన్నటికి మొన్న కర్నాటక రాష్ట్రంలో బీర్ సేల్స్ రికార్డ్ బద్దలు కొట్టింది. ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే.. ఎండ మండిపోతుంది.. 42, 43 డిగ్రీలు.. దీంతో బీర్ సేల్స్ అమాంతం పెరిగాయి. ఇక్కడే మందు ప్రియులకు చిక్కొచ్చి పడింది. 

వారం రోజులుగా.. సిటీ పరిధిలోని వైన్ షాపుల్లో చిల్ బీర్లు దొరకటం లేదు.. ముఖ్యంగా లైట్ బీర్స్.. కేఎఫ్ లైట్, ఆర్సీ లైట్, ట్యూబర్గ్ వంటి బ్రాండెడ్ లైట్ బీర్లు అస్సలు దొరకటం లేదు.. ఒకటికి నాలుగు, ఐదు షాపులు తిరిగినా నో స్టాక్ అనే సమాధానమే వస్తుంది. లైట్ లేదు.. స్ట్రాంగ్ ఉంది.. తీసుకుంటే తీసుకో లేకపోతే.. అది కూడా అయిపోతుందనే సమాధానం షాపుల నుంచి వస్తుంది. 

సమ్మర్ లో.. సహజంగా బీర్ సేల్స్ డబుల్ ఉంటాయి.. అలాంటిది ఈసారి అందుకు భిన్నంగా లైట్ బీర్స్ కొరతకు కారణాలు అర్థం కావటం లేదు మందు ప్రియులకు. సిటీలోనే కాదు.. సిటీ శివార్లలోనూ ఇదే పరిస్తితి అని మందు ప్రియులు అంటున్నారు. లైట్ బీర్లు ఎందుకు కొరత వచ్చింది.. ఎందుకు స్టాక్ లేదు అనేది అర్థం కాక చిర్రెత్తుకొస్తున్నారు మందు ప్రియులు. ఆల్ట్రా లైట్ బ్రాండెడ్ బీర్లు కొన్ని షాపుల్లో దొరుకుతున్నా.. వాటి ధరలు చాలా ఎక్కువ.. దీంతో రెగ్యులర్ గా బీర్ తాగే మందు ప్రియులు మాత్రం.. లైట్ కోసం ఆరాటపడుతున్నారు. 

పొద్దంతా ఎండలో గొడ్డు చాకిరి చేసి వస్తే బీర్లు లేవంటావా మేము ఫ్రీగా ఇవ్వమన్నామా డబ్బులకే కదా..! అని వైన్ లోని సిబ్బందితో రచ్చకు దిగుతున్నారు. అవును మరి వారం రోజులుగా ఇదే తంతు నడుస్తుంది. లైట్ బీర్లు ఎందుకు వస్తలేవ్ అని గట్టిగా ప్రశ్నించడంతో తమకు స్టాక్ ఇవ్వడం లేదని షాపు యాజమాన్యం కూడా అంతే కరాకండిగా చెబుతుంది. 

గత సంవత్సరం అంటే 2023 మే నెలలో 4 కోట్ల 23 లక్షల బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన రోజుకు 23,50,164 బీర్లు అమ్ముడుపోయాయి.  చూస్తుండగానే ఈ ఏడాది మే వచ్చేసింది.. ఎండలు కూడా రోకళ్లు పగిలేలా కొడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.. ఈ క్రమంలో లైట్ బీర్లు దొరక్కపోవడం అనేది మద్యం ప్రియులకు షాక్ అనే చెప్పాలి.