మదిని వెంటాడే జ్ఞాపకాల కలనేత.. మర్చిపోవాలనే అనుకుంటున్నాను పుస్తకం

మదిని వెంటాడే  జ్ఞాపకాల కలనేత.. మర్చిపోవాలనే అనుకుంటున్నాను పుస్తకం

పరియేరుం పెరుమాళ్, కర్ణన్, మా మన్నన్, బైసన్ లాంటి సామాజిక చైతన్యాన్ని రగిల్చిన  చిత్రాలతో తమిళ సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు దర్శకుడు మారి సెల్వరాజ్.  దర్శకుడిగా మాత్రమే అందరికీ సుపరిచితుడైన ఆయన స్వతహాగా ఒక రచయిత కూడా. వెండితెరపైనే కాదు, తన కలంతోనూ పదునైన సామాజిక అంశాలను స్పృశిం చగలనని ‘‘మర్చిపోవాలనే అనుకుంటున్నాను’ పుస్తకంతో ఆయ న నిరూపించారు. 

‘తామరభరణియిల్ కొల్లపడాధవర్గళ్’ అనే కథా సంపుటితో ఆకట్టుకున్న మారి.. ఆ గుర్తింపుతో  ‘మరక్కవే నినైక్కిరేన్’ అనే ధారావాహికను తమిళంలోని ప్రముఖ పత్రిక ‘వికటన్’లో ప్రచురించాడు. 2013 లోనే తమిళ పాఠకులను అలరించిన ఈ పుస్తకం ఇప్పుడు తెలుగులో ‘మర్చిపోవాలనే అనుకుంటున్నాను’గా అనువాదమై మన ముందుకు వచ్చింది. 

తమిళనాడులోని ‘పుళియంగుళం’ అనే మారుమూల గ్రామంలోని అట్టడుగు స్థాయి నుంచి వచ్చి, గర్వించదగ్గ దర్శకుడి స్థాయిని అందిపుచ్చుకున్న ఒక దిగువ మధ్యతరగతి కుర్రోడి జీవన ప్రస్థానమిది. తన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా ఏర్చికూర్చి 31 అధ్యాయాలతో అల్లిన హారం ఈ పుస్తకం. 

‘‘మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా, కానీ అవి నన్ను వీడడం లేదు” అనే అర్థంలో మారి సెల్వరాజ్‌‌‌‌‌‌‌‌ ఈ శీర్షికను పెట్టారు. ఇందులో ఒక రకమైన ఆర్తి, గతంతో తెంచుకోలేని బంధం కనిపిస్తాయి. తాను పుట్టిపెరిగిన తమిళనాడులోని పల్లెటూరి జీవన విధానాన్ని, అక్కడి ప్రజల కష్టాలను, కుల వివక్ష మూలాలను.. మారి సెల్వరాజ్ సహజత్వానికి దగ్గరగా, తనదైన శైలిలో అక్షరీకరించారు.  పేదరికం, ఆకలి, అవమానాల మధ్య ఒక సామాన్య కుర్రాడు దర్శకుడిగా ఎలా ఎదిగాడనే ప్రయాణం ఇందులో నిగూఢంగా కనిపిస్తుంది. తన తండ్రి పడ్డ కష్టం, తల్లి చూపిన ప్రేమను చాలా సహజంగా వర్ణించారు. పల్లెటూరి తండ్రులు తమ ప్రేమను పైకి చూపించకపోయినా, బిడ్డల కోసం పడే తపనను ఇందులో చూడొచ్చు. తన సినిమాల్లో తరచుగా కనిపించే కుక్కలు, గుర్రాలు వంటి మూగజీవాలకు, మనుషులకు మధ్య అనుబంధం ఇందులోనూ హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.  

కుల వివక్ష వల్ల తన బాల్యంలో అనుభవించిన మానసిక వేదనను, అది తన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చిందో మారి సెల్వరాజ్ ఇందులో నిజాయితీగా రాశారు. తన సినిమాల్లో చూసే ఆగ్రహం, ప్రతి సీన్ వెనుక ఉన్న ఒక రాజకీయ సందేశం దశాబ్దాల కాలపు సామాజిక గాయాల నుండి వచ్చినవని ఈ పుస్తకంతో స్పష్టంగా అర్థమవుతోంది. తన జీవితాన్ని సామాన్య స్థాయి నుండి ఒక దర్శకుడిగా మలిచేందుకు దోహదం చేసిన ఎందరో వ్యక్తులతో తనకున్న తీపి, చేదుల జ్ఞాపకాల కలనేత ఈ ‘మర్చిపోవాలనే అనుకుంటున్నాను.’ 

సరళమైన భాషతోనే పాఠకుడిని ఆలోచింపజేయడం మారి సెల్వరాజ్‌‌‌‌ శైలి. ఇందులోని ప్రతి అధ్యాయం ఒక చిన్న సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది. మనం చూసిన బాల్యాన్ని, మన చుట్టూ ఉన్న సమాజంలోని వ్యక్తులను ఈ పుస్తకంలో పోల్చుకుంటాం. ఇదొక వ్యక్తి జ్ఞాపకాల దొంతరలా కాకుండా ఒక తరం పడ్డ సంఘర్షణకు అద్దంలా ఉంటుంది. సమాజంలో మనిషికి మనిషి ఇవ్వాల్సిన కనీస గౌరవం గురించి ఇది మాట్లాడుతుంది.  మారి సెల్వరాజ్ సినిమాలను ఇష్టపడే వారే కాదు, సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకం ఇది.  తెలుగు అనువాదం చాలా బాగా కుదిరింది. తెలుగులో నేరుగా చదివినట్లుంది.  

శ్రీనివాస్ తెప్పల తమిళం నుండి తెలుగుకు అనువదించిన ఈ పుస్తకాన్ని జోశ్యుల పబ్లికేషన్స్ తరపున సూర్య ప్రకాష్ జోశ్యుల చూడముచ్చటైన కవర్ పేజీ, అందమైన బొమ్మలతో పాఠకుల ముందుకు తెచ్చారు. 

- రమేష్ బాబు పమ్మి, ఫిల్మ్​ జర్నలిస్ట్​