సజీవ చరిత్రకు సాక్ష్యం.. కొలనుపాక క్షేత్రం

సజీవ చరిత్రకు సాక్ష్యం.. కొలనుపాక క్షేత్రం

‘‘ఈ తెలుగు నేలలో  జిగి మెండు” అన్నాడు  కవి  దాశరథి. అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంది అని అర్థం. ఎంతో చైతన్యం, వైవిధ్యం, సౌజన్యం, సౌగంధ్యం గల చరిత్ర ఈ గ్రామ ప్రత్యేకత. ఆ గ్రామమే యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట దగ్గర ఉన్న కొలనుపాక. 

కొలనుపాక జైన క్షేత్రంగానే ఈ తరానికి తెలుసు. కానీ, ఒకనాడు ఈ గ్రామం శైవ, వైష్ణవ, జైన మతాలకు.. ఆధ్యాత్మిక, చారిత్రక, సంస్కృతికి కేంద్రంగా విలసిల్లింది. సాహిత్యం, శిల్పం తదితర కళలు పెంపొందించబడ్డాయి. క్రీ. శ.907వ సంవత్సరంలో రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు వెల్మజాలలో వేయించిన శాసనంలో కొలనుపాక గ్రామం ప్రస్తావన ఉంది.  రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు ఈ గ్రామాన్ని పాలించి ఎన్నో సేవలు చేశారు. తర్వాత వచ్చిన కుతుబ్​షాహీలు, నిజాంలు, ఆంధ్ర ప్రాంత పాలకుల ఆదరణకు నోచుకోక  వెనుకబాటుకు గురైంది.

ఇక్కడ శైవ, వైష్ణవ, జైన మతాలు అన్నీ సమాన ఆదరణ పొందాయి. మతాచార్యులు, కవులు, దేశభక్తుల కృషి వల్ల ప్రజల్లో చైతన్యం నెలకొల్పారు.  ఆనాటి ఆధ్యాత్మిక పరిస్థితులను గమనిస్తే కొలనుపాకలో స్వయంభూ దేవాలయం సోమేశ్వర స్వామి వారిగా కాలాముఖ శైవ సంప్రదాయంలో పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ 22 కులాలకు, 22 మఠాలకు, 22 ఆలయాలు ఉన్నాయి. అవి ఆరాధ్య స్థలాలుగా మాత్రమే కాకుండా సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లాయి. 

వర్తక, వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. సహస్ర లింగ దేవాలయం క్రీ.శ.1220లో కాకతీ మైలాంబ నిర్మించింది. వీర నారాయణ స్వామి ఆలయం క్రీ.శ. 1104లో నిర్మించారు. ఇక్కడి ప్రతాపరుద్ర ఆలయం కూడా కాకతీయుల కాలంలోనే నిర్మించారని శాసనాల ఆధారంగా తెలుస్తోంది. అలాగే కొలనుపాకకు 3 కిలోమీటర్ల దూరంలో కాశీబుగ్గగా ప్రసిద్ధిగాంచిన విశ్వేశ్వర ఆలయం ఉంది. చనిపోయిన వారి అస్థికలను ఇక్కడి కోనేరులో కలిపి విశ్వేశ్వరుని పూజిస్తారు. 

ఇప్పటికీ ఈ దేవాలయంపై జైన, బౌద్ధ శిల్ప ఛాయలు కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత వీరగల్లులు. అంటే యుద్ధవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన శిలా ఫలకాలు. ఇక్కడి జైన దేవాలయం శ్వేతాంబరం శాఖకు సంబంధించినది. ఈ గ్రామం జైన మత కేంద్రంగా ఉండడంతో చుట్టు పక్కల గ్రామాల్లో జైన బసదులు నిర్మితమయ్యాయి. అవి విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశాయి. 
ఆధునిక తెలంగాణ చరిత్రలో ఈ గ్రామం ప్రజా ఉద్యమాలకు పుట్టినిల్లు. అప్పట్లో జరిగిన జాగీర్దారి వ్యతిరేక, మత మార్పిడి, వెట్టి చాకిరి వ్యతిరేక, గ్రంథాలయ, సత్యాగ్రహ, రజాకార్ల వ్యతిరేక, జాయిన్ ఇండియా ఉద్యమాల్లో ఈ గ్రామం ప్రత్యేకతను సంతరించుకుంది. కొన్ని ఘటనలను పరిశీలిస్తే.. 1926లో తురాబ్ యార్ జంగ్ ఆధ్వర్యంలో ఇక్కడి హరిజనులను మతం మార్పిడి చేస్తే ఆరుట్ల లక్ష్మీనరసింహరెడ్డి, బెల్లపు కొండా లింగయ్య నాయకత్వంలో వాళ్లను తిరిగి హిందూ మతంలోకి తీసుకొచ్చారు. 

అలాగే నిరంకుశత్వానికి, జాగీర్దారి రైతు ఉద్యమానికి, వెట్టి వ్యతిరేక ఉద్యమంలో ఈ గ్రామ నాయకులు పోరాటం చేసి పాలకుల మెడలు వంచారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేసిన సత్యాగ్రహ ఉద్యమంలో వడ్ల రాములు, ఆరుట్ల వీరారెడ్డి పాల్గొని సంవత్సరం జైలు పాలయ్యారు. వడ్ల రాములు ఇంటిని కొలనుపాక తహశీల్దారు నాజరలి జప్తు చేశాడు. ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి ఉత్సవం, రథోత్సవాలపై ఆంక్షలు వేసిన జాగిర్దరికి వ్యతిరేకంగా పోరాటం చేసిన బెల్లపు కొండా లింగయ్య, ఆకుల వెంకయ్య, మాటూరి రామ స్వామి, ఇందుల మల్లయ్యతో సహా 13 మందిపై రాజద్రోహ నేరం మోపారు. బూర్గుల రామకృష్ణారావు ద్వారా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత పోలీసులే కేసులను స్వతంత్రంగా ఉపసంహరించుకున్నారు.

తురాబ్ యార్ జంగ్ జాగీర్దారు పాలనలో కొలనుపాక ప్రజాజీవనం అతలాకుతలం అయ్యింది. దాస్య అహంకారం ప్రజలను కప్పి వేసింది. తెలుగు సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు దూరమయ్యాయి. తెలుగు సంస్కృతి వికాసానికి, పునరుత్తేజానికి ఆంధ్ర మహాసభ, గ్రంథాలయ ఉద్యమం ఆసరాగా నిలిచాయి. ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపి రాత్రి పాఠశాలలు, గ్రంథాలయాలు స్థాపించేలా చేశాయి. స్త్రీల పాఠశాలను స్థాపించి వారిలో చైతన్యం కలిగించిన ఘనత ఆరుట్ల కమలాదేవికి దక్కింది. ఆనాటి ప్రజల చైతన్యానికి గుర్తుగా ఇప్పటికీ ఈ గ్రంథాలయం కొనసాగుతూ ఉంది. 

ఈ గ్రామంలో రజాకార్ల దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. మానభంగాలు, దోపిడీలు, హత్యలు చేసేవారు. వాళ్లను కమ్యూనిస్టు దళాలు, ప్రజా రక్షణ దళాలు ఎదుర్కొనేవి. వాటికి ఆరుట్ల లక్ష్మీనరసింహరెడ్డి, ఆరుట్ల రామచంద్రరెడ్డి నాయకత్వం వహించేవాళ్లు. ఫిబ్రవరి 2 ,1948లో రేణుకుంట గ్రామంలో రాజకార్లు  ఊరిపై పడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి రాంరెడ్డిని హత్య చేశారు. ఈ ఉద్యమంలో  కొలనుపాక గ్రామస్తులు చల్ల పుల్లారెడ్డి, పగడాల సత్తయ్య సాయం చేశారు.

 1947 సెప్టెంబర్ 15న జాయిన్ ఇండియా ఉద్యమంలో కానుగు యాదగిరి, మిరియాల నరహరి, ఆరుట్ల వీరారెడ్డి సత్యాగ్రహ జట్టుగా పాల్గొని రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.18 సెప్టెంబర్ 1948 లో ఇండియన్ యూనియన్​లో చేరిందన్న వార్త తెలియగానే కొలనుపాక రజాకార్ల కేంద్రంపై కుర్రారం రాంరెడ్డి, ఆరుట్ల రామచంద్రరెడ్డి నాయకత్వాన పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆ ప్రజా చైతన్యం చూసి రజాకార్లు పారిపోయారు. ఆ తర్వాత కూడా ఈ గ్రామానికి చెందిన ఆరుట్ల రామచంద్రరెడ్డి, ఆరుట్ల కమలాదేవి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు.

- ఆర్.భాస్కర్ రెడ్డి, సామాజిక విశ్లేషకులు
యాదాద్రి భువనగిరి, 9110542007