V6 News

4 వేల మందిని పీకేయనున్న కాగ్నిజెంట్.. లేఆఫ్స్ కోసం ఎన్ని కోట్లు పక్కన పెట్టిందంటే..?

4 వేల మందిని పీకేయనున్న కాగ్నిజెంట్.. లేఆఫ్స్ కోసం ఎన్ని కోట్లు పక్కన పెట్టిందంటే..?

ఐటీ రంగంలో మరోసారి లేఆఫ్స్ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా దాదాపు 4వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని సమాచారం. 'ప్రాజెక్ట్ లీప్' పేరుతో చేపట్టిన ఈ భారీ ప్రక్షాళన వెనుక ప్రధాన లక్ష్యం.. AI వైపు మళ్లడం, ఖర్చులను తగ్గించుకోవడమేనట. ఈ వార్తలు ప్రస్తుతం టెక్కీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

తొలగించిన ఉద్యోగులకు ఇచ్చే సెవెరెన్స్ పేమెంట్స్ అదే పరిహారం కోసం కాగ్నిజెంట్ ఇప్పటికే పక్కన పెట్టిందట. కంపెనీ సుమారు 270 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.2వేల 430 కోట్లు ఇందుకోసం కేటాయించింది. ఇంత భారీ మొత్తాన్ని కేటాయించారంటే లేఆఫ్స్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

మిడ్-లెవల్ ఉద్యోగులకే ముప్పు?
ఈ లేఆఫ్స్ ప్రధానంగా సంస్థలోని మిడ్-లెవల్ టెక్కీలపై పడే అవకాశం ఉంది. ఒకవైపు 4వేల మందిని తొలగిస్తూనే, మరోవైపు 20వేల మంది ఫ్రెషర్లను తీసుకుంటామని కంపెనీ ప్రకటించడం గమనార్హం. అంటే ఎక్కువ జీతాలు తీసుకునే అనుభవజ్ఞుల స్థానంలో.. తక్కువ ఖర్చుతో ఆటోమేషన్ ఉపయోగిస్తూ ఫ్రెషర్లతో పనులు జరిపించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్త హెడ్‌కౌంట్ 3లక్ష 57వేల 600గా ఉంది.

కంపెనీ సీఈఓ ఎస్. రవికుమార్ నేతృత్వంలో జరుగుతున్న రెండవ రౌండ్ లేఆఫ్స్ ఇవి. కేవలం మనుషులపై ఆధారపడకుండా.. ప్లాట్‌ఫారమ్ ఆధారిత ఏఐ సేవలను అందించడమే లక్ష్యంగా 'ప్రాజెక్ట్ లీప్'ను రూపొందించారు. దీనివల్ల కంపెనీకి ఏడాదికి సుమారు రూ.2వేల 700 కోట్లు ఆదా అవుతుందని అంచనా.

కొత్త కంపెనీల కొనుగోలు.. 
ఒకవైపు ఉన్న ఉద్యోగులను తొలగిస్తూనే.. మరోవైపు వ్యాపార విస్తరణకు కాగ్నిజెంట్ భారీగా ఖర్చు చేస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన ఐటీ సేవల సంస్థ ఆస్ట్రేయాను రూ.5వేల 400 కోట్లు పెట్టి కొనేందుకు సిద్ధమైంది టెక్ దిగ్గజం. డిజైన్ అండ్ ఏఐ డీల్స్‌ను దక్కించుకోవడంలో ఈ వ్యూహం తోడ్పడుతుందని భావిస్తోంది.

భారతీయ టెక్కీలపై ప్రభావం..
కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. కాబట్టి ఈ 4వేల మంది తొలగింపు ప్రభావం భారతీయ సెంటర్లపైనే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి కారణాలతో ఐటీ రంగం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఒరాకిల్, టీసీఎస్ గతంలోనే కోతలు విధించగా.. ఇప్పుడు కాగ్నిజెంట్ వంతు వచ్చింది. ఈ పరిణామాలతో ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలను ఏఐ దిశగా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.