హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. నాంపల్లి గాంధీ భవన్ ఎదురుగా ఉన్న గగన్ విహార్ భవనంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళ్తే... గగన్ విహార్‌లోని 7వ అంతస్తులో ఉన్న జీడిమెట్ల సర్కిల్-2 వాణిజ్య పన్నుల శాఖ (Commercial Tax Department) కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, ఫైళ్ల కదలిక కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారని అందిన పక్కా సమాచారంతో అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
సోదాల సందర్భంగా కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఏసీబీ బృందం.. పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. అలాగే, కంప్యూటర్లలోని డేటాను విశ్లేషించేందుకు హార్డ్ డిస్కులను కూడా సీజ్ చేశారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న నగదు, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ఏసీబీ చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలు నగరంలోని ఇతర ప్రభుత్వ విభాగాల్లోనూ కలకలం రేపుతున్నాయి. విచారణ ముగిసిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

