పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 4వ తేదీకి ముందే సీఎం మమతా బెనర్జీ తన సైన్యాన్ని సమరానికి సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటలూ కాపలా కాయాలని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఆధిక్యం ఉంటుందని చెబుతున్నా.. మమతా బెనర్జీ మాత్రం వాటిని కొట్టిపారేశారు. టీఎంసీ కార్యకర్తలను నిరుత్సాహపరచడానికే ఇవన్నీ సృష్టించిన రాజకీయ కథనాలని ఆమె ఆరోపించారు. బీజేపీకి తెలుసు.. మేము 226 సీట్ల మార్కును దాటబోతున్నామని.. మా జోరును ఎవరూ ఆపలేరని దీదీ ధీమా వ్యక్తం చేశారు.
వీడియో రిలీజ్ చేసిన మమతా బెనర్జీ .. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పగలు మీ కార్యకర్తలను ఉంచండి.. రాత్రిపూట మీరే స్వయంగా కాపలా కాయండి. అవసరమైతే నా నియోజకవర్గంలో నేనే స్వయంగా కాపాల ఉంటా అంటూ నాయకుల్లో ధైర్యాన్ని నింపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎక్కడా రాజీ పడకూడదని ప్రతి అడుగును పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. 2016, 2021 ఎన్నికల అనుభవాలను గుర్తు చేస్తూ.. అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే అనుకూలంగా వచ్చాయని, కానీ ఫలితాలు మాత్రం టీఎంసీ వైపే నిలిచాయని ఆమె గుర్తు చేశారు. మీడియా కథనాలు ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, అభ్యర్థులు లెక్కింపు కేంద్రాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరు సాగుతోంది. పీపుల్స్ పల్స్, జన్మత్ వంటి సంస్థలు టీఎంసీకి 180 నుంచి 200 పైగా సీట్లు వస్తాయని చెబుతుంటే.. మ్యాట్రిజ్, పి-మార్క్ వంటి సంస్థలు మాత్రం బీజేపీకే మెజారిటీ (150-175 సీట్లు) వస్తుందని జోస్యం చెబుతున్నాయి.

