V6 News

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ఊచకోత.. 155 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ఊచకోత.. 155 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ

RCB vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు చేతులెత్తేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 155 పరుగులకే ఆలౌట్ అయింది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో గుజరాత్ ఇప్పుడు బరిలోకి దిగనుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో విరాట్ కోహ్లీ స్టేడియాన్ని హోరెత్తించాడు. కగిసో రబాడ వేసిన రెండో ఓవర్లో విరాట్ వరుసగా ఐదు ఫోర్లు (4,4,4,4,4) బాది ఏకంగా 21 పరుగులు రాబట్టాడు. అయితే ఈ జోరు ఎక్కువ సేపు నిలవలేదు.

మూడో ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి జాకబ్ బెథెల్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అనంతరం విరాట్ కోహ్లీ (21) రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్ ఖాన్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ రజత్ పాటిదార్ (19) కాసేపు మెరిసినా, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో హోల్డర్‌కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ (9), కృనాల్ పాండ్యా (4), రొమారియో షెపర్డ్ (17) కూడాఘోరంగా విఫలమయ్యారు.

ఇక ఒకవైపు వికెట్లు పడుతున్నా దేవదత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. స్కోరు బోర్డును ముందుకు నడిపించే క్రమంలో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారీ ఆశలతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (12) నిరాశపరిచాడు. జిడ్డు బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడి అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివర్లో జోష్ హేజిల్‌వుడ్ రనౌట్ కావడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ 155 పరుగుల వద్ద ముగిసింది. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 3 వికెట్లతో వెన్నెముక విరవగా, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, రబాడలకు చెరో వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా ఛేదిస్తుందా? లేక ఆర్సీబీ బౌలర్లు మ్యాజిక్ చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.