- ఐపీఎల్లో నాలుగో అత్యధిక టార్గెట్ ఛేజ్ చేసిన రైజర్స్
- 6 వికెట్లతో ముంబైపై విజయం
- దంచికొట్టిన హెడ్, క్లాసెన్ రికెల్టన్ సెంచరీ వృథా
ఐపీఎల్లో సన్‌రైజర్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ట్రావిస్ హెడ్ (76), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్), అభిషేక్ శర్మ (45) చెలరేగడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 6 వికెట్ల తేడాతో ముంబైకి షాకిచ్చింది. ముంబై 20 ఓవర్లలో 243/5 స్కోరు చేయగా.. హైదరాబాద్ 18.4 ఓవర్లలో 249/4 రన్స్ చేసి గెలిచింది.
ముంబై: ఐపీఎల్–19లో మరోసారి తమ బ్యాట్ పవర్ చూపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబై ఇచ్చిన 244 భారీ టార్గెట్‌ను ఉఫ్ అని ఊదేస్తూ లీగ్ ఆరో విక్టరీ అందుకుంది. ఛేజింగ్‌లో ట్రావిస్ హెడ్ (30 బాల్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), హెన్రిచ్ క్లాసెన్ (30 బాల్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్), అభిషేక్ శర్మ (24 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) చెలరేగడంతో.. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 6 వికెట్ల తేడాతో ముంబైకి షాకిచ్చింది. టాస్ గెలిచిన ముంబై 20 ఓవర్లలో 243/5 స్కోరు చేసింది.
ర్యాన్ రికెల్టన్ (55 బాల్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 123 నాటౌట్) సెంచరీతో దంచికొట్టగా, విల్ జాక్స్ (22 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), హార్దిక్ పాండ్యా (15 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) అండగా నిలిచారు. తర్వాత హైదరాబాద్ 18.4 ఓవర్లలో 249/4 స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక రన్ ఛేజ్ కావడం విశేషం. ఈ సీజన్‌లో రెండోది. క్లాసెన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్ కుమార్తె అకాల మరణానికి సంతాపంగా ప్లేయర్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్ ధరించారు.
రికెల్టన్ సూపర్ సెంచరీ..
ఫ్లాట్ పిచ్‌పై ముంబైని కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు ఫెయిలయ్యారు. దాంతో తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు విల్ జాక్స్ నాలుగు ఫోర్లు, రికెల్టన్ ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదారు. నాలుగో ఓవర్‌లో ఈషాన్ మలింగ (1/29) ఆరు రన్సే ఇచ్చినా.. హర్ష్ దూబే వేసిన ఐదో ఓవర్‌లో జాక్స్ 6, 6, 4తో జోరు పెంచాడు. ఆరో ఓవర్‌లో రికెల్టన్ దీన్ని రిపీట్ చేయడంతో పవర్‌ప్లేలో ముంబై 78/0 స్కోరు చేసింది.
ఏడో ఓవర్‌లో 6, 4తో 15 రన్స్ రాగా, తర్వాతి ఓవర్‌లో జాక్స్‌ను ఔట్ చేసి నితీశ్ (1/31) షాకిచ్చాడు. దాంతో తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలో 93 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. సూర్యకుమార్ (5) ఫోర్‌తో ఖాతా తెరవగా, రికెల్టన్ బౌండ్రీతో 23 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. 9వ ఓవర్‌లో ఈషాన్ దెబ్బకు సూర్య ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 13 రన్సే జతయ్యాయి. నమన్ ధీర్ (22) రెండు ఫోర్లు కొట్టడంతో తొలి 10 ఓవర్లలో ముంబై 124/2 స్కోరు చేసింది.
ఇక్కడి నుంచి రికెల్టన్ 4, 4, 6, 6తో విధ్వంసం మరో మెట్టు ఎక్కింది. అప్పటి వరకు దూకుడుగా ఆడిన నమన్‌ను 14వ ఓవర్‌లో ప్రఫుల్ హింగే (2/54) దెబ్బకొట్టాడు. ఫలితంగా మూడో వికెట్‌కు 55 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన హార్దిక్ పాండ్యా వేగంగా ఆడాడు. 15వ ఓవర్‌లో రికెల్టన్ 4, 6తో 44 బాల్స్‌లో సెంచరీ చేయడంతో స్కోరు 181/3కి పెరిగింది.
తర్వాతి ఓవర్‌లో రికెల్టన్ 4, పాండ్యా 4, 6, 4తో 21 రన్స్ దంచారు. ఆ వెంటనే మరో సిక్స్ కొట్టిన పాండ్యాను 19వ ఓవర్‌లో సాకిబ్ హుస్సేన్ (1/39) ఔట్ చేశాడు. సిక్స్‌తో ఖాతా తెరిచిన తిలక్ వర్మ (7) ఆఖరి ఓవర్‌లో వెనుదిరిగాడు. చివరి రెండు బాల్స్‌కు రికెల్టన్ 6, 4 కొట్టడంతో ఈ సీజన్‌లో ముంబై భారీ స్కోరు చేసింది.
దంచికొట్టిన హెడ్, క్లాసెన్
ఛేజింగ్‌లో హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అభిషేక్.. బుమ్రాకు 6, 4తో స్వాగతం పలికాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదిన హెడ్ క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డాడు. తర్వాతి ఓవర్‌లోనూ 6, 4 కొట్టాడు. ఇదే ఓవర్‌లో అభిషేక్ 4, 4తో 19 రన్స్ వచ్చాయి. ఐదో ఓవర్‌లో చెరో ఫోర్, ఆరో ఓవర్‌లో హెడ్ రెండు ఫోర్లు, అభిషేక్ సిక్స్‌తో పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 92/0 స్కోరు చేసింది.
ఏడో ఓవర్‌లో హెడ్ 4, 6, 6, 4తో 23 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలో 20 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. 8వ ఓవర్‌లో హెడ్ సిక్స్ కొట్టినా.. తర్వాతి ఓవర్‌లో ఘజన్‌ఫర్ (2/51) వరుస బాల్స్‌లో అభిషేక్, ఇషాన్ కిషన్ (0)ను ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తొలి వికెట్‌కు 129 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగియగా స్కోరు 129/2గా మారింది.
10వ ఓవర్‌లో పాండ్యా (1/39) ఓ సూపర్ బాల్‌తో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. చివరి 12 బాల్స్‌లో 8 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి ముంబై మళ్లీ రేసులోకి వచ్చింది. 133/3తో ఇబ్బందుల్లో పడిన ఎస్‌ఆర్‌హెచ్‌ను క్లాసెన్, నితీశ్ (21) ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. 11వ ఓవర్‌లో నితీశ్ 4, క్లాసెన్ 4, 6తో స్కోరు 150/3కి చేరింది.
12వ ఓవర్‌లో క్లాసెన్ 4, 4, 4, 4 తర్వాతి ఓవర్లలో 4, 6 బాదాడు. ఈ క్రమంలో 22 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన క్లాసెన్ 6, 4 దంచాడు. 17వ ఓవర్‌లో నితీశ్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 80 రన్స్ జతయ్యాయి. ఇక 19 బాల్స్‌లో 25 రన్స్ కావాల్సిన దశలో క్లాసెన్ 4, సలీల్ అరోరా (30 నాటౌట్) 6, 4, 6, 6తో ఈజీగా విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
- ముంబై: 20 ఓవర్లలో 243/5 (రికెల్టన్ 123 నాటౌట్, జాక్స్ 45, ప్రఫుల్ హింగే (2/54).
- హైదరాబాద్: 18.4 ఓవర్లలో 249/4 (హెడ్ 76, క్లాసెన్ 65నాటౌట్, ఘజన్‌ఫర్ 2/51).

