సత్నా: ఆమె అప్పటికే నలుగురు పిల్లల తల్లి. ఇప్పుడు మరో ముగ్గురు బిడ్డలకు ఒకే కాన్పులో జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో వెలుగుచూసింది. కుటుంబ నియంత్రణపై మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనారాహిత్యం ఇప్పటికీ ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. ఈ పిల్లలకు జన్మనిచ్చిన తల్లి వయసు 34 సంవత్సరాలు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పన్నా జిల్లాలోని ఉజ్నేహి గ్రామానికి చెందిన కాంచన్ సోనీ అనే గర్భిణి స్త్రీకి పురిటి నొప్పులు రావడంతో పన్నా జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె గర్భంలో మూడు పిండాలు ఉన్నట్లు నిర్ధారించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను సత్నా జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఆమెను ఏప్రిల్ 27న ఆసుపత్రిలో చేర్పిచంగా.. అదే రోజు రాత్రి సుమారు 90 నిమిషాల వ్యవధిలో ముగ్గురు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది.
ఆసుపత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి బిడ్డగా ఒక బాబు రాత్రి 10:34 గంటలకు జన్మించాడు. కేవలం 11 నిమిషాల తర్వాత రాత్రి 10:45 గంటలకు రెండవ సంతానంగా మరో బాబు పుట్టాడు. ఆపై రాత్రి 11:57 గంటలకు పాప పుట్టింది. ఇలా.. 90 నిమిషాల వ్యవధిలో ఆమె ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లలు సహజ ప్రసవంలోనే పుట్టడం ఇక్కడ మరో విశేషం. ఇలా రెండు, మూడు పిండాలు కడుపులో ఉన్నప్పుడు సహజ ప్రసవం జరగడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. పుట్టిన పిల్లల బరువు.. ఒకరు 2 కిలోలు, మరొకరు 2.3 కిలోలు, ఇంకొకరు 2.65 కిలోలు.
అయితే.. ఈ ఆసుపత్రిలో ఇలాంటి కేసు ఇది రెండోది కావడం గమనార్హం. 2025 నవంబర్‌లో కూడా ఇదే తరహాలో ఒక గర్భిణీ స్త్రీ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. కాంచన్ సోనీకి ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారని తెలిసి ప్రసవం చేసిన వైద్యులు విస్తుపోయారు. ఆమెకు 11, 9, 7, 5 సంవత్సరాల వయస్సు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నారు.
ఇప్పుడు ముగ్గురు కవలలు పుట్టడంతో, ఇప్పుడు ఆ కుటుంబంలో మొత్తం పిల్లల సంఖ్య ఏడుకి చేరింది. వాస్తవానికి ఐదో నెలలోనే ఆమె కడుపులో మూడు పిండాలు ఉన్న సంగతి కుటుంబ సభ్యులకు తెలిసింది. అల్ట్రాసౌండ్‌లో మూడు పిండాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ ముగ్గురు పిల్లలను కనేందుకే ఈ కుటుంబం మొగ్గు చూపడం గమనార్హం.

