హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని ప్రమాదకర బిల్డింగ్ లపై అలర్ట్ అయ్యింది. ఏప్రిల్ 29న బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు ఓ ప్రహరీ గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్‌లో కూడా ఇలాంటి విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రాణ నష్టాన్ని నివారించేందుకు, కూలే స్థితిలో ఉన్న పాత నిర్మాణాలను గుర్తించి వాటిని సురక్షితంగా కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది.
మీ పరిసరాల్లో ఎక్కడైనా ప్రమాదకరంగా ఉన్న పాత భవనాలు, గోడలు ఉంటే వెంటనే హైడ్రా హెల్ప్‌లైన్ నంబర్ 9000113667 కు సమాచారం అందించాలని హైడ్రా సూచించింది. మీరు ఫిర్యాదు చేసే సమయంలో ఆ బిల్డింగ్ ఫోటోతో పాటు కరెంట్ లొకేషన్ షేర్ చేస్తే అధికారులు తక్షణమే స్పందిస్తారని తెలిపింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.
అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదం ఏ క్షణమైనా సంభవించవచ్చు. కేవలం వర్షాకాలమే కాదు.. ఏ సమయంలోనైనా అప్రమత్తంగా ఉండాలని హైడ్రా సూచించింది.

