V6 News

మే 1 నుంచి కొత్త గ్యాస్ బుక్కింగ్ రూల్స్.. డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు పెరుగుతాయా..?

మే 1 నుంచి కొత్త గ్యాస్ బుక్కింగ్ రూల్స్.. డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు పెరుగుతాయా..?

మే నెల ప్రారంభం కావడానికి ముందే సామాన్యులకు షాకిచ్చే వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్, గ్యాస్ ధరల్లో వస్తున్న మార్పుల వల్ల మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలతో పాటు, వాటి బుకింగ్ రూల్స్‌లో కూడా కీలక మార్పులు వస్తున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల వంటగది బడ్జెట్‌పై ప్రభావం చూపే ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం.

గ్యాస్ బండ రేట్లు మళ్లీ పెరగనున్నాయా?
చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. గత ఏప్రిల్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర సుమారు రూ.60 పెరగ్గా, కమర్షియల్ సిలిండర్ల ధరలు ఏకంగా 3 సార్లు పెరిగాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు దాటడంతో.. మే నెలలో కూడా గ్యాస్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

బుకింగ్ రూల్స్ కఠినం..
సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం గ్యాస్  బుకింగ్ రూల్స్ కఠినతరం చేస్తోంది. ఇకపై పట్టణ ప్రాంతాల్లో రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలంటే కనీసం 25 రోజుల వేచి ఉండాల్సిందే. గతంలో ఇది 21 రోజులుగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిరీక్షణ సమయం ఏకంగా 45 రోజులకు పెరిగే అవకాశం ఉంది. హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

ఓటీపీ ఉంటేనే డెలివరీ..
సిలిండర్ డెలివరీ ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం 'డీఏసీ' డెలివరీ అథెంటికేషన్ కోడ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. సిలిండర్ మీ ఇంటికి వచ్చినప్పుడు.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని డెలివరీ ఏజెంట్‌కు చెబితేనే గ్యాస్ సిలిండర్ అందుతుంది. ఇప్పటికే 94 శాతం డెలివరీలు ఈ పద్ధతిలోనే జరుగుతుండగా.. మే 1 నుంచి దీన్ని 100 శాతం అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఎందుకు ఈ మార్పులు?
అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్న తరుణంలో.. సబ్సిడీ సిలిండర్లు అర్హులకే అందేలా చూడటంతో పాటుగా పంపిణీలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులు కూడా నెలవారీ ధరల అప్డేట్స్‌ను గమనిస్తూ.. కొత్త రూల్స్ కి అనుగుణంగా తమ బుకింగ్‌లను ప్లాన్ చేసుకోవడం కీలకం.