పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేసినవ్ కేటీఆర్? : ఎంపీ చామల కిరణ్

పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేసినవ్ కేటీఆర్? : ఎంపీ చామల కిరణ్
  • ఎంపీ చామల కిరణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘‘పదేండ్లు బీఆర్ఎస్​అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినవ్​కేటీఆర్​.. మూసీ నదిని మురికి కూపంగా చేసింది మీరు కాదా.. ఇప్పుడు డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ చేస్తామంటే ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నవ్​?" అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై ఫైర్​అయ్యారు. 

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు చెబితే, కేటీఆర్ మాత్రం అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరుగుతుందనే భయంతో  కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘మూసీ ప్రాజెక్టుకు లక్షా 50 వేల కోట్లు అవుతాయని తప్పుడు లెక్కలు చెబుతున్నరు. అదే లక్షన్నర కోట్లతో మీరు కట్టిన కాళేశ్వరం ఇప్పుడు 'కూలేశ్వరం' అయ్యింది. ఆ పైసలతోటే మూసీ ప్రక్షాళనతో పాటు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి కదా?" అని ప్రశ్నించారు.  కేటీఆర్, హరీశ్​రావుతో పాటు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒకసారి అహ్మదాబాద్​కు వెళ్లి సబర్మతి రివర్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ చూసి రావాలని ఎంపీ సూచించారు. అక్కడ బీజేపీ సీఎం, కాంగ్రెస్ మేయర్ కలిసి అభివృద్ధి కోసం సహకరించుకున్న తీరును గుర్తు చేశారు. 

ప్రపంచమంతా తిరిగిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు థెమ్స్, హాన్ నదుల అభివృద్ధి కనపడలేదా అని నిలదీశారు. గాంధీ సరోవర్‌‌‌‌‌‌‌‌కు కేవలం 70 కోట్లు ఖర్చవుతుందని సీఎం చెబితే.. దాన్ని 5 వేల కోట్లు అంటూ కేటీఆర్ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు కూలగొడుతున్నారని అంటున్న కేటీఆర్‌‌‌‌‌‌‌‌.. నువ్వు సిరిసిల్లకు వస్తావా లేక భువనగిరికా? ఎక్కడికి వచ్చినా సరే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మంజూరు చేసిన 3,500 ఇళ్లను చూపిస్తా.. అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా అబద్ధాలు మానుకొని, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఎంపీ హితవు పలికారు.