Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

సీబీఐ పేరుతో  ఓ రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేసి రూ.35 లక్షలు కొట్టేశారు కొందరు కేటుగాళ్లు. ఈ ఘటన ఏప్రిల్ 27వ తేదీ శనివారం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన 65 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి అయిన బాధితుడికి మోసగాళ్ల నుంచి కాల్ వచ్చింది. బాధితుడి ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన మొబైల్ నంబర్ పై అక్రమ ప్రకటనలు పంపి ప్రజలను వేధిస్తున్నట్లు  కేటుగాళ్లు చెప్పారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 67ఏ, సెక్షన్ 354ఏ, సెక్షన్ 499, సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తామని మోసగాళ్లు బెదిరించారు. బాధితుడిని తన ఒరిజినల్ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయాలని,  వెంటనే ముంబై పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. అయితే తనకు ఏ కేసులోనూ సంబంధం లేదని, ఆ నంబర్ తనది కాదని బాధితుడు మోసగాళ్లకు తెలిపాడు.

ఆ తర్వాత బాధితుడికి నకిలీ సీబీఐ ప్రొఫైల్ నుంచి స్కైప్ వీడియో కాల్ వచ్చింది. తాను నిర్దోషినని చెప్పినప్పటికీ కేటుగాళ్లు బాధితుడిని విచారించడం కొనసాగించారు. దీంతో ఒత్తిడికి గురై నిజమైన విచారణ అని నమ్మిన బాధితుడు.. మోసగాళ్లకు తన వివరాలన్నింటినీ వెల్లడించాడు. దీంతో మోసగాళ్లు బాధితుడిని మానసికంగా బెదిరించి, విచారణ పూర్తికాకముందే ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.  ఆ తర్వాత బాధితుడి పొదుపు మొత్తం రూ. 34,00,000 (ముప్పై నాలుగు లక్షలు మాత్రమే) RTGS ద్వారా ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయమని ఆదేశించారు.  పూర్తి విచారణ అనంతరం 3 నుంచి 4 రోజుల్లో మొత్తం తిరిగి చెల్లిస్తామని మోసగాళ్లు హామీ ఇచ్చారు.

రూ.35 లక్షలు బదిలీ అయినా.. మోసగాళ్ళు బాధితుడిని విచారించడం కొనసాగించారు. మరింత డబ్బు కొట్టేసేందుకు ప్రయత్నించారు. బాధితుడు తన భార్య ఆభరణాలను విక్రయిండంతో వచ్చిన మొత్తాన్ని కూడా డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన మోసమని గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.