ఇన్ఫోసిస్‌వి అబద్ధాలు.. ఆదాయం, లాభం పెంచి చూపించారు

ఇన్ఫోసిస్‌వి అబద్ధాలు.. ఆదాయం, లాభం పెంచి చూపించారు
  • కంపెనీ ఉద్యోగుల ఆరోపణలు
  • ఇందుకు సీఈఓ,సీఎఫ్‌ఓలే కారణం
  • ఎథికల్‌ గ్రూప్‌ పేరిటఎంప్లాయిస్‌ కంప్లెయింట్‌
  • ఈ- మెయిల్స్‌, వాయిస్‌ రికార్డులూ ఉన్నట్లు వెల్లడి
  • కంపెనీ బోర్డుకూ, యూఎస్‌ ఎస్‌ఈసీకి కూడా ఫిర్యాదు
  • ఫిర్యాదును ఆడిట్‌ కమిటీకి పంపామని బదులిచ్చిన ఇన్ఫోసిస్‌

బెంగళూరు :

ఇన్ఫోసిస్‌‌ ఆదాయం, లాభాలు పెంచి చూపిస్తున్నారంటూ కంపెనీ బోర్డు, యూఎస్‌‌ సెక్యూరిటీస్‌‌ కమిషన్‌‌ (ఎస్‌‌ఈసీ)లకు ఎథికల్‌‌ ఎంప్లాయీస్‌‌ గ్రూప్‌‌ ఫిర్యాదు చేసింది. షార్ట్‌‌ టర్మ్‌‌ రెవెన్యూ, ప్రాఫిట్స్‌‌ పెంచేందుకు కంపెనీ అక్రమ మార్గాలు అనుసరిస్తోందనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణలు రుజువు చేసేందుకు తగిన ఈ–మెయిల్స్‌‌, వాయిస్‌‌ రికార్డింగ్స్‌‌ తమ వద్ద ఉన్నాయని కూడా ఆరోపణలు చేస్తున్న ఎథికల్‌‌ గ్రూప్‌‌ ప్రకటించుకుంది. ఇన్ఫోసిస్‌‌ బోర్డు, ఎస్‌‌ఈసీలకు ఈ ఎథికల్‌‌ గ్రూప్‌‌ పంపిన లెటర్లు బైటకు వచ్చాయి. పెద్ద డీల్స్‌‌ విషయంలో రివ్యూలు, అప్రూవల్స్‌‌ను  సీఈఓ సలీల్‌‌ పరేఖ్‌‌ దాటవేస్తున్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. కావాల్సిన మార్జిన్స్‌‌ చూపించేందుకు తన ఊహలకు తగినట్లుగా  వ్యవహరిస్తున్నారనీ విమర్శిస్తున్నారు.

మా గొంతు నొక్కేస్తున్నారు

ఇన్ఫోసిస్‌‌ సీఎఫ్‌‌ఓ చట్టాలకు అనుగుణంగానే ఉన్నా, పెద్ద డీల్స్‌‌ సమాచారాన్ని బోర్డుకు ప్రజంట్‌‌ చేసేందుకు మాత్రం తమను అనుమతించడం లేదని ఎథికల్‌‌ గ్రూప్‌‌ ఆ లెటర్‌‌లో విమర్శించింది. గత రెండు క్వార్టర్స్‌‌లో కుదుర్చుకున్న భారీ డీల్స్‌‌లో అసలు మార్జిన్లే లేవని వెల్లడించింది. డీల్‌‌ ప్రపోజల్స్‌‌, మార్జిన్స్‌‌, డీల్స్‌‌ కుదరడానికి ముందే జరిపిన చెల్లింపులు, రెవెన్యూ గుర్తించే పద్ధతుల విషయంలో ఆడిటర్ల నుంచి వివరణ తీసుకోవాలని కూడా ఈ ఎథికల్‌‌ గ్రూప్‌‌ కోరింది.

ఆడిట్‌‌ కమిటీ చూస్తోంది…

ఇదిలా ఉంటే, ఎథికల్‌‌ గ్రూప్‌‌ పేరిట వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌‌ లిమిటెడ్‌‌ ప్రకటించింది. విజిల్‌‌ బ్లోయర్‌‌ ఆరోపణలను ఆడిట్‌‌ కమిటీ ముందు ఉంచినట్లు వెల్లడించింది. కంపెనీ ఇందుకోసం రూపొందించుకున్న విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. వీసా వ్యయాలను గత క్వార్టర్లో (జూలై–సెప్టెంబర్‌‌)నే పూర్తిగా గుర్తించొద్దనీ, ఒక కాంట్రాక్టులోని 50 మిలియన్‌‌ డాలర్ల రివర్సల్‌‌నూ పరిగణించొద్దని టీమ్‌‌ను కోరినట్లు ఎథికల్‌‌ గ్రూప్ తన లెటర్‌‌లో ప్రస్తావించడం గమనార్హం. వెరిజాన్‌‌, ఇంటెల్‌‌ వంటి భారీ డీల్స్‌‌, జపాన్‌‌లో జాయింట్‌‌ వెంచర్లు, ఏబీఎన్‌‌ ఆమ్రో ఎక్విజిషన్‌‌లో చాలా అక్రమాలు జరిగాయని పేర్కొంది. ఈ డీల్స్‌‌ అన్నింటిలోనూ రెవెన్యూ రికగ్నిషన్ ఎకౌంటింగ్‌‌ ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని విమర్శించింది. 2020 రెండో క్వార్టర్లో తన మార్జిన్స్‌‌ 120 బేసిస్‌‌ పాయింట్లు పెరిగినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ ఈ క్వార్టర్లో  ఎనలిస్టుల అంచనాలకు మించిన ఫలితాలే సాధించింది.

ఫైనాన్స్‌‌ టీమ్‌‌పై పరేఖ్‌‌, రాయ్‌‌ ఒత్తిడి తెచ్చారు..

ఎనలిస్టుల అంచనాలకు మించిన ఫలితాలను చూపించేందుకు అనుగుణంగా తగిన సర్దుబాట్లను ట్రెజరీ మేనేజ్‌‌మెంట్‌‌లో చేయాల్సిందిగా ఫైనాన్స్‌‌ టీమ్‌‌పై సీఈఓ సలీల్‌‌ పరేఖ్‌‌, సీఎఫ్‌‌ఓ నిరంజన్‌‌ రాయ్‌‌లు వత్తిడి తెచ్చినట్లు కూడా ఎథికల్‌‌ గ్రూప్‌‌ లెటర్‌‌ ఆరోపిస్తోంది. కొన్ని రిస్క్‌‌లు తీసుకుని, విధానాలు మార్చాల్సిందిగా ఆ టీమ్‌‌ను కోరినట్లు వెల్లడిస్తోంది. 20 ఎఫ్‌‌, యాన్యువల్‌‌ రిపోర్టులలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించొద్దని తమను కోరినట్లు కూడా పేర్కొంటోంది. మంచి విషయాలను మాత్రమే చూపించాలని కూడా ఫైనాన్స్‌‌ టీమ్‌‌ను కోరినట్లు ఎథికల్‌‌ గ్రూప్‌‌ చెబుతోంది.   ఇది నియంత్రణాపరమైన అంశంమని, దర్యాప్తు చేసేప్పుడు అన్ని ఆధారాలనూ అందిస్తామని కూడా ఎథికల్‌‌ గ్రూప్‌‌ స్పష్టం చేసింది.

గతంలోనూ కంప్లెయింట్లు..

ఈ విజిల్‌‌ బ్లోయర్‌‌ లెటర్‌‌పై సెప్టెంబర్‌‌ 20 వ తేదీ ఉంది. ఇక యూఎస్‌‌ ఎస్‌‌ఈసీకి సెప్టెంబర్‌‌ 27 న మొదటి లెటర్‌‌ పంపినట్లు,  అక్టోబర్‌‌ 3 న పంపిన మరో లెటర్‌‌ ద్వారా తెలుస్తోంది. యూఎస్‌‌ స్టాక్‌‌ ఎక్స్చేంజెస్ లో ఇన్ఫోసిస్‌‌ ఏడీఆర్‌‌లు ట్రేడవుతున్న విషయం తెలిసిందే. గత నెలలోనే కంపెనీ డిప్యూటీ సీఎఫ్‌‌ఓ జయేష్‌‌ సంఘ్రాజ్క రిజైన్‌‌ చేశారు. గతంలోనూ ఇన్ఫోసిస్‌‌ విజిల్‌‌ బ్లోయెర్‌‌ కంప్లెయింట్స్‌‌ ఎదుర్కొంది.

మాజీ సీఈఓ విశాల్‌‌ సిక్కా 2017లో కంపెనీని వదిలి పెట్టినప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కార్పొరేట్‌‌ గవర్నెన్స్‌‌పై ఇన్ఫోసిస్‌‌ ఫౌండర్‌‌ ఎన్‌‌ ఆర్‌‌ నారాయణ మూర్తితో అప్పటి సీఈఓ విశాల్‌‌ సిక్కా గొడవ పడ్డారు. దీంతో కో ఫౌండర్‌‌ నందన్‌‌ నీలెకన్ని మరోసారి నాన్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ ఛైర్మన్‌‌గా 2017 లో ఇన్ఫోసిస్‌‌లో పదవీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.