అంగీలు చింపుకొని.. దాడులు చేసుకొని రైతులపై నెట్టేస్తున్నరు

అంగీలు చింపుకొని.. దాడులు చేసుకొని రైతులపై నెట్టేస్తున్నరు

నెట్​వర్క్, వెలుగు: పోడు భూములకు పట్టాలిస్తామని 7 నెలల కింద అప్లికేషన్లు తీసుకున్న రాష్ట్ర సర్కారు.. పట్టాల సంగతి పక్కనపెట్టి ఫారోస్టోళ్లతో తప్పులు కేసులు పెట్టిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కోయపోచగూడెం ఆదివాసీలు 20 ఏండ్లుగా సాగుచేస్తున్న భూముల్లో చిన్న పొదలను తొలగిస్తే కొత్తగా చెట్లు కొట్టేసినట్లు తప్పుడు కేసులు పెట్టిన ఫారెస్టోళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బండారుగుంపులో పోడు రైతులను ఏకంగా ఇసుక స్మగ్లర్లుగా చూపారు. తమపై కట్టెలతో దాడి చేశారంటూ హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయించారు. ఇది మరవకముందే తాజాగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్​లో దుక్కిదున్నుతున్న రైతులను అడ్డుకున్న ఓ బీట్​ ఆఫీసర్ తన షర్ట్​ తానే చింపుకొని, గిరిజనులు దాడి చేసినట్లు సీన్​ క్రియేట్ ​చేయడం చర్చనీయాంశమవుతున్నది.

రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీమ్- ఆసిఫాబాద్, మంచిర్యాల,  మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి,  భద్రాద్రి- కొత్తగూడెం, ఖమ్మం, నాగర్​కర్నూల్ జిల్లాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు 7 నెలల కింద  3.4 లక్షల మంది పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. మొత్తం12 లక్షల ఎకరాల కోసం వచ్చిన ఈ అప్లికేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం.. తాజాగా అటవీ అధికారుల ద్వారా రైతులపై తప్పుడు కేసులు పెట్టిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 30, 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను దున్నేందుకు వెళ్తున్న రైతులపైనా కొత్తగా చెట్లు కొట్టి, పోడు చేస్తున్నట్లు ఫారెస్టోళ్లు కేసులు పెడ్తున్నారు. మంచిర్యాల జిల్లా కోయపోచగూడెంలో  జూన్​1న 12 మంది ఆదివాసీ మహిళలను అరెస్ట్​ చేసి జైలుకు పంపించారు. 2003 నుంచి పోడు భూములు సాగుచేస్తున్నప్పటికీ కొత్తగా పోడు చేసినట్లు వీళ్లపై కేసులు పెట్టారు.  గతంలో చిన్నచిన్న కేసులు పెట్టి వదిలేసేవాళ్లు. కానీ ఇప్పుడు అడవుల దురాక్రమణ, పర్యావరణానికి విఘాతంలాంటిసెక్షన్ల కింద నాన్​బెయిలబుల్​ కేసులు పెట్టి ఏడేండ్ల దాకా జైలు నుంచి బయటకు రాకుండా కుట్ర పన్నుతున్నారు. 

ఇసుక స్మగ్లర్లుగా చిత్రీకరించే యత్నం 

ఈ నెల 4న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారుగుంపు అటవీ ప్రాంతంలో ఇసుక స్మగ్లర్లు తమపై కట్టెలతో దాడి చేశారని, జీపుపై పెట్రోల్​పోసి చంపే ప్రయత్నం చేశారని ఫారెస్ట్​ఆఫీసర్లు ఆరోపించారు. ఈ క్రమంలో ఎఫ్ఆర్ఓ వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్​లో బైట ధర్మారావు, బైట గోపాలరావు, సునీల్, దాసు, కొర్స మహేశ్​ అనే  ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కానీ వీరంతా పోడు రైతులు కావడం గమనార్హం. రాత్రిపూట పోడుభూములు దున్నుతున్న తమ దగ్గరికి అటవీశాఖాధికారులు వచ్చారని, తాము ఎవరిపైనా దాడి చేయలేదని బండారుగుంపు గ్రామస్తులు మీడియా ప్రతినిధులకు ఫోన్​చేసి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. తమకు ఇసుక అక్రమ రవాణాతో ఎలాంటి సంబంధం లేకున్నా ఫారెస్ట్ ఆఫీసర్లు కావాలనే  తప్పుడు కేసులు బనాయిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. కట్టెలతో దాడి చేశారని ఫారెస్టోళ్లు చెప్తున్నప్పటికీ వారికి ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అటవీఅధికారులు ఇటీవల వందలాది పోడు రైతులపై ఇలాంటి తప్పుడు కేసులు పెడ్తున్నారు. పోడు భూములకు సర్కారు ఇయ్యాలో, రేపో పట్టాలిస్తదనుకుంటే ఇలా తప్పుడు కేసులు పెట్టడమేంటని గిరిజనులు ప్రశ్నిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.