వీడియో: తల్లిదండ్రులూ జాగ్రత్త!.. అక్కడ బాల్ తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

వీడియో: తల్లిదండ్రులూ జాగ్రత్త!.. అక్కడ బాల్ తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఓ 11 ఏళ్ల బాలుడు ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలి మరణించాడు. బంతి తగిలిన మరుక్షణం బాలుడు నొప్పితో విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన పూణెలోని లోహెగావ్‌లో చోటుచేసుకుంది. మృతుడిని శౌర్య ఖడ్వేగా గుర్తించారు. 

శౌర్య బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్‌మన్ బంతిని అతని వైపు నేరుగా కొట్టాడు. వేగంగా దూసుకొచ్చిన బంతి అతని ప్రైవేట్ భాగాలపై తాకింది. అతను వెంటనే  నొప్పితో నేలపై కుప్పకూలిపోయాడు. ఏమైందో అన్న భయంతో స్నేహితులు అతని వైపు పరుగులు తీశారు. వారిలో ఒకరు అతని ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. అనంతరం శౌర్యను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తల్లిదండ్రులూ జాగ్రత్త..!

వేసవి సెలవలు కావడంతో పిల్లలు సరదా కోసం వివిధ రకాల ఆటపాటలను ఎంచుకోవచ్చు. వాటిలో ఏవి మంచి, ఏవి చెడు అన్నది పిల్లలకు క్లుప్తంగా వివరించండి. ఎండలు మండిపోతుండడంతో వేసవి తాపం తీర్చుకోవడానికి చెరువులు, కుంటలు, బావుల వెంట  పరుగులు పెడుతుంటారు. వీటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. చెస్, క్యారమ్స్, డ్రాయింగ్, పెయింటింగ్, పియానో, గిటార్ వాయించడం వంటి ప్రత్యామ్నాయ గేమ్‌లవైపు పిల్లలను ప్రోత్సహించండి.