భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్లోని అశ్వాపురం మండలానికి చెందిన ఇద్దరు ఎల్ఐసీ ఏజెంట్లు చీటింగ్ చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి రూ.1.52 కోట్లు కాజేశారు. భద్రాచలం ఎల్ఐసీ మేనేజర్ చక్రవర్తి ఫిర్యాదుతో సోమవారం రాత్రి పట్టణ సీఐ నాగరాజు కేసు నమోదు చేశారు. నిరుపేదలు, అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతూ వారు బతికుండగానే చనిపోయినట్లు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి గుట్టుగా డబ్బులు మింగేశారు.
అశ్వాపురం మండలానికి చెందిన ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి భద్రాచలం శాఖలో 39 మంది ఖాతాదారుల పేరుతో ఈ దందా చేశారు. మరణించిన వారిపై కూడా కొన్ని కిస్తీలు, పాలసీలు కట్టి తర్వాత నకిలీ డెత్ సర్టిఫికెట్ల ద్వారా ఇన్సూరెన్స్ డబ్బులు స్వాహా చేశారు. పాలసీదారులను కొందరిని ఆఫీసర్లు నేరుగా కలిసినప్పుడు ఈ బాగోతం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
