కొల్లాపూర్, వెలుగు: నాలుగు నెలల గర్భిణి అయిన భార్యను భర్త కడుపుపై తన్నడంతో చనిపోయింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామానికి చెందిన బత్తిని మౌనిక(21), మాధవరావుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మౌనిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి.
వారు కొల్లాపూర్ పట్టణంలోని జమ్మినిగడ్డ ఎస్సీ కాలనీలో ఉంటున్నారు. మౌనికకు ఇటీవల చికెన్ ఫాక్స్ సోకింది. ఆమె అస్వస్థతకు గురి కావడంతో నాగరాజు ఆమెను కొల్లాపూర్ సర్కారు దవాఖానకు తీసుకెళ్లాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నాగరాజు కోపంతో మౌనిక కడుపుపై కాలితో తన్నడంతో స్పృహ కోల్పోయింది.
మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. నాగరాజు కడుపుపై తన్నడంతోనే మౌనిక చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై సురేశ్‌ను వివరణ కోరగా, తమకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
