పుష్ఫ జోరు తగ్గేదేలే!

పుష్ఫ జోరు తగ్గేదేలే!


అల్లు అర్జున్ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఊపందుకున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ‘పుష్ప.. ద రైజ్’ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. దాంతో ఇప్పటినుండే ప్రమోషన్‌‌పై ఫోకస్ పెట్టిన టీమ్, ఈ నెల 13న ఫస్ట్ సాంగ్‌‌ని విడుదల చేయబోతున్నారు. ‘దాక్కో దాక్కో మేక’ అంటూ సాగే ఈ ఎనర్జిటిక్ సాంగ్‌‌ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్‌‌తో  పాడించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోని నిన్న విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్‌‌తో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా మెరిశాడు. ఫారెస్ట్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో భారీ ఎత్తున ఈ సాంగ్‌‌ని షూట్ చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. చేతిలో వేట కత్తితో చిందేస్తున్నాడు అల్లు అర్జున్. దాంతో ఇది ఫుల్‌‌ మాస్‌‌ సాంగ్‌‌ అని అర్థమవుతోంది. రష్మిక హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పహాద్ ఫాజిల్ విలన్‌‌గా నటిస్తున్నాడు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో షూటింగ్‌‌ జరుగుతోంది. అదే లొకేషన్‌‌లో ‘శాకుంతలం’ షూటింగ్ కూడా జరుగుతోంది. బన్నీ కూతురు ‘అర్హ’ అందులో భరతుడిగా నటిస్తోంది. దాంతో సెట్‌‌లో కూతురిని కలిసిన బన్నీ.. ‘ఓ నటుడిగా నేను నటి అర్హని కలిశాను. ఇలా కలిసే క్షణాలు మరో పదిహేను, ఇరవయ్యేళ్ల తర్వాత వస్తాయనుకున్నాను. కానీ ఇంత త్వరగా వచ్చేశాయి. ఇది ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం’ అంటున్నాడు బన్నీ.