ముంబై: డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చేపట్టిన ఆపరేషన్ టైగర్‌పై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ టైగర్ వెనక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆరోపించారు. భవిష్యత్తులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం ఉన్నందున అతడిని రేసు నుంచి తప్పించేందుకు అమిత్ షా ఈ ఆపరేషన్ నడిపించారని సంచలన ఆరోపణలు చేశారు.
శివసేన తిరుగుబాటు ఎంపీలు బీజేపీలో చేరకుండా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ప్రధాని పదవి కోసం బీజేపీలో పోటీ ఏర్పడితే.. ఈ తిరుగుబాటు ఎంపీలు అమిత్ షాకే ఓటేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఆపరేషన్ టైగర్ కాదని.. ఆపరేషన్ దేవేంద్ర ఫడ్నవీస్ అని అభివర్ణించారు.
డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి వీలు కల్పించేందుకు పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో సహాయపడటమే ఆపరేషన్ టైగర్ మరో లక్ష్యమని థాక్రే పేర్కొన్నారు. అధికారం కోసం బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపు ఎంపీలు బాలాసాహెబ్ థాక్రేకు ద్రోహం చేశారని తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు.
ప్రజలు బీజేపీని తిరస్కరించడం వల్లే ఫిరాయించిన ఎంపీలు గెలిచారని గుర్తుచేశారు. కానీ వారు ప్రజా తీర్పును కాలరాస్తూ తిరిగి బీజేపీ కూటమి గూటికే చేరారని విమర్శించారు. ఇక, దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు, పేపర్ లీక్ వంటి సమస్యలను కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమి విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని ఆరుగురు శివసేన యూబీటీకి చెందిన ఎంపీలు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరంతా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.
