మణుగూరులో మరోమారు భూకంపం

మణుగూరులో మరోమారు భూకంపం

మణుగూరు, వెలుగు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మరోమారు భూకంపం సంభవించింది.  శుక్రవారం ఉదయం 4:43 నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించడంతో  నిద్రలో ఉన్న జనం ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు.  దాదాపు 5 సెకండ్ల పాటు ఈ భూకంపం వచ్చింది. ఈనెల 20 తేదీ సాయంత్రం కూడా భూమి ఇదేవిధంగా కంపించింది. అయితే సింగరేణి సంస్థ బ్లాస్టింగ్ లతో ఈ కంపనాలు వచ్చినట్లు ప్రజలు అనుకున్నారు.

కానీ శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం టైంలో సింగరేణిలో ఎలాంటి బ్లాస్టింగ్ జరిగే అవకాశం లేదు. అయితే మణుగూరులో భూకంపం సంభవించినట్లు దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ డిపార్ట్​మెంట్​ తన ఆఫిషీయల్​ వెబ్​సైట్​లో ధ్రువీకరించింది.  భూమి అంతర్భాగంలో 30 కిలోమీటర్ల మేర కదలికలు ఏర్పడినట్లు తెలిపింది.  నిద్రిస్తుండగా ఈ భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా భయంతో జనం పరుగులు పెట్టారు. దీనిపై స్థానిక తహసీల్దార్​ ఆఫీస్​ అధికారులను వివరణ కోరగా భూకంపంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.