బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ

బీజేపీకి 200 సీట్లలోపే: దీదీ

గోఘాట్ :  ఈ లోక్‌‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమే గెలుస్తుందని.. కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓటమి తప్పదని.. ఆ పార్టీకి ‘200 సీట్ల’ దాటవని అన్నారు. శనివారం ఆరంబాగ్ లోక్‌‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌‌లో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం ప్రతిష్టను దిగార్చేందుకు కాంగ్రెస్, సీపీఎంలు బెంగాల్​లో బీజేపీకి తెరవెనుక మద్దతు పలుకుతున్నాయని ఆమె మండిపడ్డారు. ఆ పార్టీలకు ఓటు వేయవద్దని ఆమె ఓటర్లను కోరారు. ‘‘నిరంకుశ, దురహంకార మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు 

జాతీయ స్థాయిలో పార్టీలన్ని కూటమిగా కలిసి పనిచేస్తున్నాయి. దానికి ఇండియా కూటమి అని నేనే పేరు పెట్టాను. కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు టీఎంసీ కీలక పాత్ర పోషిస్తోంది. మోదీ ఇప్పుడు ఏం చెబుతున్నాడో గమనించండి.. బీజేపీకి 400 సీట్లు వస్తాయనడం లేదు. వారికి 200 సీట్లు కూడా దాటవు” అని ఆమె అన్నారు.

ఓట్ల కోసం బీజేపీ దుర్మార్గమైన కుట్రలు

మోదీ, అమిత్​ షా బెంగాల్ వ్యతిరేకులని మమత ఆరోపించారు. రాష్ట్రంపై తమకు ప్రేమ ఉందని మీడియాలో ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన బెంగాలీల మనోభావాలు, పాటించే ధర్మం వారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరన్నారు. నిరుపేద, అమాయక మహిళలతో తెల్లపేపర్లపై సంతకాలు తీసుకొని లైంగిక దాడులంటూ దుష్ర్పచారం చేశారన్నారు. ఓట్ల కోసం ఎంతటి దుర్మార్గమైన కుట్రలకైనా పాల్పడతారు” అని విమర్శించారు.