ఇండియా మ్యాప్ తో పాక్ కు ట్రంప్ టీం షాక్

ఇండియా మ్యాప్ తో పాక్ కు ట్రంప్ టీం షాక్
  • భారత్​లోనే పీఓకే, అక్సాయ్ చిన్
  • ‘ఎక్స్’ లో పోస్ట్​ చేసిన ట్రంప్​ టీమ్​

న్యూఢిల్లీ: అమెరికా–ఇండియా మధ్య ట్రేడ్ ​డీల్​ఖాయమైన సమయంలో ట్రంప్​ టీమ్​ రిలీజ్​ చేసిన ఓ మ్యాప్​ పాకిస్తాన్​ను షాక్​కు గురిచేసింది. అమెరికా ట్రేడ్ ప్రతినిధుల ఆఫీస్ ​శనివారం ‘ఎక్స్’లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో భాగంగా చూపిస్తూ మ్యాప్​​ను విడుదల చేశారు. ఇందులో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)తో పాటు అక్సాయ్​ చిన్ ప్రాంతం కూడా ఇండియాలో భాగంగా ఉంది. ఇండియా ఎప్పటి నుంచో కాశ్మీర్ తమ అంతర్భాగమని చెబుతున్నది.

పాకిస్తాన్​ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఈ విషయంలో అమెరికా తటస్థంగా ఉండేది. అయితే అమెరికా సంస్థలు గతంలో విడుదల చేసిన మ్యాప్‌‌లలో వివాదాస్పద ప్రాంతాలను వేరుగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు రిలీజ్​ చేసిన మ్యాప్ మాత్రం భారత్​కు 
అనుగుణంగా ఉండడంతో ప్రాధాన్యత ఏర్పడింది.

పీఓకే, అక్సాయ్ చిన్ ప్రాంతాలు..

పీఓకే విషయంలో అమెరికా ఇంతవరకు స్పష్టంగా భారత అభిప్రాయానికి అనుగుణంగా ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు రిలీజైన మ్యాప్..  పాకిస్తాన్‌‌కు దౌత్యపరమైన ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యూఎస్​తో పాకిస్తాన్ సంబంధాలను మెరుగుపరుచుకుంటూ వస్తున్నది. ఇప్పుడు అవన్నీ బెడిసి కొట్టినట్టేనని అంటున్నారు.  మరోవైపు, అక్సాయ్​ చిన్ ప్రాంతంపై తమకు హక్కు ఉందని చెప్పుకుంటున్న చైనాకూ ఈ విషయం మింగుడు పడదని అంటున్నారు.